
ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీ.. క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. బిహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఖాతా తెరిచింది. అయితే బెంగాల్, తమిళనాడులో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక, తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న చోట్లలో అభ్యర్థులను నిలిపింది. యూపీలో 100 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. పలు ప్రాంతాల్లో అభ్యర్థులను పోటికి దించారు.
అయితే యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. ఎంఐఎం భారీ సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టినా కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే తూర్పు యూపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్పీ ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపినట్టుగా సమాచారం.
ఇక, యూపీలో ఎంఐఎం అభ్యర్థుల తరఫున అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న సమయంలో అసదుద్దీన్ వాహనం కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
అయితే యూపీలో విజయం సాధించి దేశ రాజకీయాల్లో మరింత కీలకంగా వ్యవహరించాలని భావించిన అసదుద్దీన్ ప్రయత్నాలకు ఒక రకంగా బ్రేక్ పడినట్టే చెప్పాలి. యూపీలో ఖాతా తెరవడం ద్వారా.. త్వరలో జరనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జోష్‌తో ముందుకు సాగాలని భావించింది. ఇందుకోసం కలిసివచ్చే పార్టీలను కలుపుకుపోవాలని చూసింది. అయితే యూపీ ఫలితాలు మాత్రం ఎంఐఎంకు నిరాశనే మిగిల్చాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంఐఎంకు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మున్సిపల్ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ఉన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, బిహార్‌లలో ఎంఐఎంకు శాసనసభ్యులు ఉన్నారు.
ఇక, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ దండయాత్రతో సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ.. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. 265 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. 2017 ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే అధిక సంఖ్యలో అధిక్యంలో సమాజ్ వాదీ పార్టీ కొనసాగతున్నప్పటికీ.. ఆ పార్టీ అవసరమైన మెజారిటీకి అందనంత దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని విధంగా మళ్లీ అధికారం ఏర్పాటు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.