
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ మొదలు అయ్యింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. బీజేపీ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా అందులో 4 రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఒక్క పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ముందజంలో ఉంది.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆధికత్య ప్రదర్శిస్తోంది. ఇందులో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లు ఉన్నాయి. అయితే బీజేపీ లీడ్ లో ఉన్న గోవా, ఉత్తరాఖండ్ లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎం అభ్యర్థులు, ప్రస్తుత సీఎంలు మాత్రం వెనుకంజలో ఉన్నారు. దీంతో ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీయే అధికారంలో ఉంది. ఒక్క పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే పంజాబ్ లో కూడా ఈ సారి కాంగ్రెస్ అధికారం పొగొట్టుకునేలా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ఉన్నారు. ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచే మరోసారి బరిలోకి దిగారు. మనోహర్ పారికర్ మృతి చెందటంతో హైకమాండ్ సీఎం పగ్గాలు ప్రమోద్ సావంత్ కు అప్పగించింది. కాగా దివంగత నేత మనోహర్ పారికర్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ తండ్రి పోటీ చేసిన పనాజీ నుంచే బరిలోకి దిగారు. పనాజీ నుంచి బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో స్వతంత్రంగా పోటీ చేశారు. గోవాలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు గెలుపొందిన బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తొలుత చిన్న పార్టీలతో జత కట్టి బీజేపీ అధికారాన్ని చేపట్టగా.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచే పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 19కు చేరగా.. కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యేల సంఖ్య 2కు పడిపోయింది.
ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి సీఎంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ వుంటోంది. ప్రజలు సైతం ప్రభుత్వాలను మారుస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఐదేళ్లకొకసారి అధికారాన్ని అందుకుంటున్నాయి. అయితే ఈ సారి మాత్రం ప్రజలు రెండో సారి బీజేపీకే అధికారం కట్టబెట్టేలా కనిపిస్తున్నారు. బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఈ సారి ఈ రాష్ట్రంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీలు కూడా పోటీ చేశాయి. కానీ అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి.