
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన 28 ఏళ్ల మహిళకు లక్నోలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో అరుదైన చికిత్స చేశారు. ఆమె ప్రాణాలు నిలపడానికి కాసేపు ఆమె నిర్జీవిగా మార్చేశారు. రక్త నాళాల్లో సమస్యను తొలగించడానికి డీప్ హైపోథర్మిక్ సర్యులేటరీ అరెస్ట్ (డీహెచ్‌సీఏ) ప్రక్రియను లక్నో వైద్యులు చేపట్టారు. ఈ ప్రక్రియ ద్వారా ఆమెను ఆరు నిమిషాలు ప్రాణం లేకుండా చేసి విజయవంతంగా సర్జరీ ముగించారు.
పేషెంట్ బృహత్ దమనిలో తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. రక్తసరఫరా సరిగా లేదు. ఆ రక్తనాళం గోడ వాచిపోయింది. వైద్యపరిభాషలో ఈ స్థితిని సూడో అనేరిజం అంటారని వైద్యులు చెప్పారు. గతంలో ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. కానీ, అది మంచి ఫలితాలను ఇవ్వలేదు. నాళం నుంచి రక్తం లీకైంది. ఇది ప్రాణాలకే ముప్పు. దీంతో వైద్యులు అనివార్యంగా డీహెచ్‌సీఏ చేపట్టాల్సి వచ్చింది.
ఈ టెక్నిక్ ద్వారా మనిషిని అచేతనంగా ఉంచొచ్చు. అదే సమయంలో మెదడుపై ప్రభావం పడకుండా రక్షించుకోవచ్చు. 18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ టెక్నిక్ ద్వారా పేషెంట్‌ను 30 నిమిషాలపాటు ఉంచొచ్చు. ఈ పద్ధతిలో మరికొన్ని అంశాలు మిళితమై ఉంటాయి.
ఈ సర్జరీ చేసిన తర్వాత నాలుగు గంటలపాటు ఆమె తీరును జాగ్రత్తగా గమనించారు. అనంతరం, వెంటిలేటర్ తీసేశారు. వారం రోజులు హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు. తర్వాత డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నదని వైద్యులు చెప్పారు.
Also Read: Khammam: చావు కూడా విడదీయలేని దాంపత్యం.. మరణించిన భార్యను చూసి కన్నుమూసిన భర్త
డీహెచ్‌సీఏ అరుదైన సర్జరీ అయినా.. కొత్తదేమీ కాదు. 1970ల నుంచి ఈ టెక్నిక్ మనుగడలో ఉన్నది. ముఖ్యంగా గర్బస్థ శిశువు, పసివాళ్లు, చిన్న పిల్లలకు చికిత్స కోసం ఈ టెక్నిక్ ఎక్కువగా వాడుతుంటారు.