అసదుద్దీన్ ఓవైసీ సవాల్ కు రెడీ: యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్

By telugu teamFirst Published Jul 5, 2021, 8:00 AM IST
Highlights

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపిలో తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఇందులో సందేహం లేదని ఆయన అన్నారు.

లక్నో: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.  2022లో జరిగే శాసనసభ ఎన్నికల ద్వారా తిరిగి బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఓవైసీ అన్నారు. ఆ వ్యాఖ్యలపై యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు స్పందించారు. 

అసదుద్దీన్ ఓవైసీ విసిరిన సవాల్ ను బిజెపి కార్యకర్తలు స్వీకరిస్తారని, తిరిగి బిజెపిని అధికారంలోకి తెస్తారని ఆయన అన్నారు.  ఓవైసీ జాతీయ నాయకుడని, ప్రచారం కోసం ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని, ఓవైసీ ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడని, ఆయన విసిరే సవాల్ ను బిజెపి కార్యకర్తలు స్వీకరిస్తారని ఆదిత్యనాథ్ అన్నారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని, ఇందులో సందేహం అవసరం లేదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవడానికి తగిన వ్యూహాన్ని తమ పార్టీ జాతీయ నాయకత్వం రూపొందించిందని ఆయన చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా తామ, తమ మిత్రులు కృషి చేస్తారని అసదుద్దీన్ ఓవైసీ శనివారంనాడు అన్నారు. యోగి ఆదిత్యనాథ్ తిరిగి అధికారంలోకి రావడాన్ని తాము అనుమతించబోమని, తాము నైతికంగా బలంగా ఉన్నామని, కఠిన శ్రమ చేస్తే తాము అనుకున్నది సాధిస్తామని ఆయన అన్నారు. బిజెపి తిరిగి అధికారం చేపట్టకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 403 శాసనసభా స్థానాలున్నాయి. వాటిలో వంద సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. ఓం ప్రకాశ్ రాజ్భర్ నాయకత్వంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో ఎంఐఎం జత కట్టింది. సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేతృత్వంలో భాగిదారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. 

click me!