తిరుమల లడ్డూ కల్తీ ఎఫెక్ట్ ... రంగంలోకి యోగి ఆదిత్యనాథ్

By Arun Kumar PFirst Published Sep 24, 2024, 4:17 PM IST
Highlights

 ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. రాష్ట్రంలోని హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించాలని... ప్రజల భద్రత కోసం నిబంధనల్లో మార్పులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అహార పదార్థాల కల్తీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఇలా తినే ఆహార పదార్థాలను కల్తీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పవిత్రమైన తిరుమల లడ్డూతో కల్తీ పదార్థాలు వాడినట్లు బయటపడటంతో యూపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అహార పదార్థాల కల్తీ ఘటనలు బయటపడిన నేపథ్యంలో సీఎం యోగి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

ఇవాళ (మంగళవారం) యూపీ సీఎం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా అహార కల్తీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లు వంటి వాటిని తనిఖీ చేయాలని ... అహార పదార్థాల్లో ఏమాత్రం కల్తీ బయటపడినా ఉపేక్షించకూడదని ఆదేశించారు. అలాగే ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని యూపీ సీఎం ఆదేశించారు.

Latest Videos

సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదేశాలివే : 

● ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అహార పదార్థాల కల్తీ ఘటనలు ఎక్కువయ్యాయి. పప్పు దినుసులు, మసాలాలే కాదు చివరకు జ్యూస్‌లను కూడా కల్తీ చేస్తున్నారు... ప్రజల ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలు కలుపుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయి.  ఇటువంటి దుర్మార్గపు చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.

● ధాబాలులేదా రెస్టారెంట్లు వంటి ఆహార సంస్థలపై తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఈ సంస్థల నిర్వాహకులు, సిబ్బంది వివరాలను ధృవీకరించాలి. ఆహార భద్రత శాఖ, పోలీసులు, స్థానిక అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలి.

● ధాబాలు/హోటళ్లు/రెస్టారెంట్లు వంటి ఆహార సంస్థల్లో నిర్వాహకులు, యజమానులు, మేనేజర్‌ల పేర్లు, చిరునామాలను ప్రముఖంగా ప్రదర్శించాలి. దీనికి సంబంధించి ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలో అవసరమైన సవరణలు చేయాలి.

● ధాబాలు/హోటళ్లు/రెస్టారెంట్లు వంటి ఆహార సంస్థల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. కస్టమర్లు కూర్చునే ప్రాంతాలతో పాటు, సంస్థలోని ఇతర ప్రాంతాలను కూడా సీసీటీవీ కెమెరాల పరిధిలోకి తీసుకురావాలి. ప్రతి సంస్థ నిర్వాహకుడు సీసీటీవీ ఫుటేజీని సురక్షితంగా భద్రపరచాలి, అవసరమైనప్పుడు పోలీసులు/స్థానిక అధికారులకు అందించాలి.

● ఆహార సంస్థల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. ఆహార పదార్థాల తయారీ మరియు వడ్డించే సమయంలో సంబంధిత సిబ్బంది మాస్క్‌లు/గ్లోవ్స్‌లను తప్పనిసరిగా ధరించాలి. ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు.

● ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదు. అలాంటి ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల తయారీ, అమ్మకాలు, ఇతర సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

click me!