ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి యోగి ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఆవిష్కరణ అభియాన్ కింద విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది.
లక్నో : చిన్న పిల్లలకు సహజంగానే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహం చూపిస్తారు. తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. అయితే అనేక కారణాల వల్ల ఆ సందేహాలకు సమాధానాలను కనుగొనలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులకు అండగా వుండేలా సరికొత్త కార్యక్రమానికి యోగి సర్కార్ శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వం పాఠశాలల్లోని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. జాతీయ ఆవిష్కరణ అభియాన్ కింద ఈ తరగతులకు చెందిన విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, ప్రయోగాత్మక అవకాశాలను కల్పించడానికి, శాస్త్రీయ ప్రక్రియలు, పద్ధతులపై సరైన అవగాహనను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేపడుతోంది ప్రభుత్వం.
పోటీల ద్వారా ఎంపిక
సెప్టెంబర్ నెలలో జరుగుతున్న 'జాతీయ ఆవిష్కరణ అభియాన్'లో భాగంగా నిర్వహించే వివిధ పోటీలు, కార్యకలాపాల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు బ్లాక్, జిల్లా స్థాయిలో పోటీ పడే అవకాశం లభిస్తుంది.
ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులలో తార్కిక ఆలోచన, టీమ్ వర్క్, పోటీతత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, భవిష్యత్ పోటీలకు సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్నారు.
మూడవ శనివారం పాఠశాల స్థాయి క్విజ్ పోటీ
సెప్టెంబర్ నెలలోని మూడవ శనివారం నిర్వహించిన పాఠశాల స్థాయి క్విజ్ పోటీలో ప్రతి ఉన్నత ప్రాథమిక, మిశ్రమ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొనే అవకాశం లభించింది. పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైన ముగ్గురు విద్యార్థుల జాబితాను బ్లాక్ స్థాయి పోటీలకు పంపించారు. ఇందుకోసం విద్యార్థుల వివరాలను బ్లాక్ స్థాయి విద్యా అధికారికి పంపారు.
నాల్గవ శనివారం బ్లాక్ స్థాయిలో పరీక్ష
పాఠశాల స్థాయి పోటీలో ఎంపికైన విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో నాల్గవ శనివారం బ్లాక్ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోటీలో ప్రతి పాఠశాల నుండి ఎంపికైన ముగ్గురు విద్యార్థులకు పాల్గొనే అవకాశం ఉంటుంది. రెండు దశల్లో జరిగే ఈ పోటీలో మొదటి దశలో బ్లాక్‌లోని అన్ని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలల నుండి ఎంపికైన విద్యార్థులు పాల్గొంటారు. 25 బహుళైచ్ఛిక ప్రశ్నల (MCQ) పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన 25 మంది విద్యార్థులను తుది దశకు ఎంపిక చేస్తారు. ఈ 25 మంది విద్యార్థుల్లో గ్రూప్ కి ఐదుగురి చొప్పున ఐదు గ్రూపులుగా విభజించి, బ్లాక్ స్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తారు. తుది దశలో విజేతగా నిలిచిన జట్టుకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.