UP Assembly Election 2022: దళితుడి ఇంటిలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ భోజనం.. ‘మా పాలనలో వివక్ష లేదు’

By Mahesh KFirst Published Jan 14, 2022, 10:39 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో శుక్రవారం ఓ దళితుడి ఇంటిలో భోజనం చేశారు. సామాజిక సామరస్యత పెంచడమే లక్ష్యమని ఆయన ఈ ఫొటోను పోస్టు చేసి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ పాలనపై విమర్శలు చేశారు. ఎస్పీ హయాంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదని, సామాజిక దోపిడీ జరిగిందని ఆరోపించారు. బీజేపీ ఏ వర్గం పట్లా వివక్ష చూపకుండా పాలన చేస్తున్నదని వివరించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) మరో నెల రోజుల్లో జరగనున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ(BJP)కి, ప్రతిపక్షంలోని సమాజ్‌వాదీ(Samajwadi Party)కి మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్, బీఎస్పీలు ఎన్నికల పోటీలో వెనుకబడ్డాయి. బీజేపీ సీనియర్ నేతుల, కేంద్రంలోని మంత్రులు, ప్రధాని మోడీ సహా చాలా మంది ఉత్తరప్రదేశ్‌ పర్యటించారు. అభివృద్ధి పథకాలు ప్రకటించారు. ఇందుకు దీటుగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రాష్ట్రంలో ముమ్మర ప్రచారం చేశారు. అయితే, ఈ వారం రోజుల వ్యవధిలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. బీజేపీ నుంచి మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఓబీసీ వర్గానికి ప్రముఖంగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపించే మంత్రులు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సంచలనానికి తెరతీసింది. వారం వ్యవధిలో బీజేపీ నుంచి మొత్తం 10 మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. బీజేపీ మిత్రపక్షం అప్నా దళ్ నుంచీ ఒకరు బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.

రాష్ట్రంలోని ఓబీసీ (OBC) ఓటర్లను చాలా వరకు ప్రభావితం చేసే ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీన వీడారు. వీరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదే రోజు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Adiyanath) కీలక కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగి ఆదిత్యానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌లోని ఓ దళిత ఇంటి (Dalit)లో ఆయన శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశారు. సామాజిక సామరస్యతను పెంపొందించే లక్ష్యం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గోరఖ్‌పూర్‌లోని జుంగియాకు చెందిన అమృత్ లాల్ భారతీజీ ఇంటిలో తనకు కిచిడీ, ప్రసాదం స్వీకరించే భాగ్యం కలిగిందని వివరించారు. ఇందుకు భారతీజీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యానాథ్ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో సామాజిక దోపిడీ రాజ్యమేలిందని, సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించలేదని ఆరోపణలు చేశారు. కాగా, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయడానికి పని చేస్తున్నదని, ఎలాంటి వివక్ష లేకుండా పాలిస్తున్నామని చెప్పారు.

బీజేపీని వీడిన ప్రముఖ ఓబీసీ నేతలు యోగి పాలనపై విమర్శలు చేశారు. యోగి ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే తాము పార్టీ వీడాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే సీఎం యోగి ఆదిత్యానాథ్ పై వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తున్నది. మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీలు బీజేపీ వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. యోగి ప్రభుత్వం తమ గోడు వినలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాతే బీజేపీ తన పాలనను సమర్థించుకుంది.

click me!