ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు...
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ శాఖలో ఖాళీల భర్తీకి యోగి సర్కార్ సిద్దమయ్యింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసారు. డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, అకౌంటెంట్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.
ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ శాఖ కార్యకలాపాలను ఆధునీకరించడానికి తహసీల్, జిల్లా, డివిజన్, రెవెన్యూ బోర్డు స్థాయిలలో నైపుణ్యం కలిగిన యువత అవసరం వుందున్నారు. ముఖ్యంగా ఐటీలో నైపుణ్యం గల యువత అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందుకోసం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇక రెవెన్యూ శాఖను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం వుందన్నారు సీఎం యోగి. ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడాలని ...ఇందుకోసం వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. అకౌంటెంట్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు వాహన భత్యాలు, డిప్యూటీ తహసీల్దార్లకు ఫోర్ వీలర్స్ అందించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. మెరుగైన జిపిఎస్ ఆధారిత పనుల కోసం కొత్త ట్యాబ్లెట్‌లను అందించాలని కూడా సూచించారు.
ఇంక రెవెన్యూ సంబంధిత పత్రాల జారీ మరీ ముఖ్యంగా భూసమస్యల విషయంలో సకాాలంలో స్పందించాలని అధికారులను ఆదేశించారు యోగి. రెవెన్యూ బోర్డులో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సెటిల్‌మెంట్ కమిషనర్లు, శిక్షణా డైరెక్టర్‌తో సహా కొత్త పదవులను సృష్టించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.