తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోయాయి ... ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాల భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
లక్నో : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ళు కూలి, ప్రాణనష్టం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు.
భారీ వర్షాలతో నీటమునిగి తీవ్ర నష్టాలపాలైన జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు వెంటనే సాయం అందించాలని... వీలైనంత తొందరగగా ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.
నీటి ముంపు ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పంపులను ఏర్పాటు చేసి నీటిని తొలగించాలని... బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.
నిన్న (12 సెప్టెంబర్ గురువారం) ఉత్తరప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాలతో నదులు, వాగులు వకంలు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి.. చెరువులు, కుంటలు వంటి జలాశయాలు నిండుకుండల్లా మారాయి. భారీ వర్షాలు, వరదలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వర్షాల దాటికి మైన్‌పురి జిల్లాలోని కురవలి తహసీల్‌లో 2, భోగావ్‌లో 3 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.