భారత్ లో కరోనా.. 8లక్షలకు తగ్గిన పాజిటివ్ కేసులు

By telugu news teamFirst Published Oct 17, 2020, 2:23 PM IST
Highlights

ఒక దశలో పది లక్షల వరకూ ఉన్న యాక్టివ్ పాజిటివ్‌లు ఇటీవలి కాలంలో రికవరీ పెరగడంతో తగ్గుముఖం పట్టింది.

భారత్ లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు ప్రతిరోజూ దాదాపు లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇప్పుడు కాస్త కోలుకున్నట్లు కనపడుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. కోలుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గి 8 లక్షలకు చేరుకుంది. 

ఒక దశలో పది లక్షల వరకూ ఉన్న యాక్టివ్ పాజిటివ్‌లు ఇటీవలి కాలంలో రికవరీ పెరగడంతో తగ్గుముఖం పట్టింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోనే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కేసులు నమోదుకాగా గత కొన్ని వారాలుగా ఈ మూడు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అదుపులోకి రావడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది.

తాజా గణాంకాల ప్రకారం దేశం మొత్తం మీద 73.70 లక్షల పాజిటివ్ కేసులు నమోదైనా అందులో సుమారు 64.53 లక్షల మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8.04 లక్షలకు పడిపోయింది. గడచిన 24 గంటల్లో 895 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 1.12 లక్షలు దాటింది. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఐదు వేల కంటే ఎక్కువ చొప్పున కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడితే దేశ సగటు కొత్త కేసుల నమోదు కూడా గణనీయంగా తగ్గుతుంది.

click me!