లేకలేక ఆడపిల్ల పుట్టిందని ... హెలికాఫ్టర్‌లో అత్తవారింటికి, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Apr 25, 2021, 6:07 PM IST
Highlights

నాగౌర్ జిల్లాలోని నింబ్డి చందవత గ్రామానికి చెందిన హనుమాన్ ప్రజాపతి అనే వ్యక్తి ఒక రైతు. వీరి కుటుంబంలో గత 35 ఏళ్లుగా ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దేవుని దీవెనల వల్ల ఎట్టకేలకు 35 ఏళ్ల తరువాత వారికి ఆ అదృష్టం దక్కింది

ఆడపిల్లలు అదృష్టానికి మారుపేరని భారతదేశంలో తరతరాలుగా వున్న నానుడి. కానీ ఇదే దేశంలో ఆడపిల్లలను పురిట్లోనే చంపిన ఉదంతాలు ఎన్నో. దేశం అభివృద్ధి చెందాలంటే కుటుంబంలో ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉండాలని పెద్దలు చెబుతారు.

పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. నేటికీ ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతోంది. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం మాత్రం ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నారు.

తల్లిని, బిడ్డను ఇంటికి తీసుకురావడానికి ఏకంగా హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో  ఇటీవల జన్మించిన ఆ నవజాత శిశువును కుటుంబ సభ్యులు బుధవారం హెలికాప్టర్‌లో సొంత గ్రామానికి తీసుకువచ్చారు. 

వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లాలోని నింబ్డి చందవత గ్రామానికి చెందిన హనుమాన్ ప్రజాపతి అనే వ్యక్తి ఒక రైతు. వీరి కుటుంబంలో గత 35 ఏళ్లుగా ఒక్క ఆడపిల్ల కూడా జన్మించలేదు. దేవుని దీవెనల వల్ల ఎట్టకేలకు 35 ఏళ్ల తరువాత వారికి ఆ అదృష్టం దక్కింది.

చాలా సంవత్సరాల తరువాత ఆడపిల్ల పుట్టినందుకు సంతోషించారు. ఇన్నేళ్ల తరువాత తమ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని వారు భావించారు. తమ బిడ్డను మొదటిసారిగా అత్తింటికి తీసుకెళ్లడాన్ని ఒక ఉత్సవంగా చేయాలనుకున్నారు. ఏకంగా హెలికాప్టర్‌లో తమ మనవరాలిని ఇంటికి తీసుకురావాలని ప్రజాపతి తండ్రి మదన్‌లాల్ భావించారు.

ఇందుకు కోసం ఆయన జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థను సంప్రదించాడు. రూ.4.5 లక్షలు వెచ్చించి ఒక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఇది వూళ్లో దిగేందుకు గాను తన సొంత పొలంలో ఒక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశాడు. 

ఆడపిల్లను ఇంటికి తీసుకురావడానికి హనుమాన్ తన బంధువులతో కలిసి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి అత్తగారి గ్రామమైన హర్సోలావ్ గ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ పూజల అనంతరం భార్య చుకా దేవి, నవజాత శిశువుతో కలిసి మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో సొంత ఊరికి బయలుదేరి, మధ్యాహ్నం 2.15 గంటలకు నింబ్డి గ్రామానికి చేరుకున్నారు.

హెలిప్యాడ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గం మొత్తం పూలతో నిండిపోయింది. హనుమాన్ కూతురికి స్వాగతం పలికేందుకు వారి కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

click me!