
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌మాత్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ప్రశ్నలు సమాధానాలు సెషన్‌లో ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కాంగ్రెస్ బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వివరించారు. ప్రజాస్వామ్యం రెండు చక్రాలపై నడుస్తుందని అన్నారు. ఒకటి అధికారపక్షమైతే.. మరొకటి ప్రతిపక్షం అని చెప్పారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని వినమ్రంగా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎందుకంటే.. కాంగ్రెస్ బలహీన పడుతున్న కొద్దీ దాని స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు ఆక్రమిస్తున్నాయని వివరించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం కూడా బలమైనదిగా ఉండాలని చెప్పారు.
ఇందుకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే ఉదాహరణ అని వివరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఆయనను జవహర్‌లాల్ నెహ్రూ గౌరవించారని గుర్తు చేశారు. కాబట్టి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. అదే సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకూ పలు సూచనలు చేశారు.
పరాజయాలు వచ్చినప్పుడూ కాంగ్రెస్ నేతలు గుండె చెదరవద్దని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ భావజాలాన్ని అనుసరించే వారు ఓటములు ఎదురైనా పార్టీని వీడరాదని సూచించారు. కాంగ్రెస్ ఉన్నతికి కట్టుబడి ఉండాలని చెప్పారు. పరాజయాలు ఎదురైనప్పుడు కలత చెందరాదని, పార్టీ పురోగతి కోసం పనిలో విశ్రమించరాదని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పరాజయం పాలైనా.. ఏదో ఒక రోజు విజయం సాధించకపోదు అని తెలిపారు.
ఒకప్పుడు బీజేపీకి కూడా రెండు పార్లమెంటు స్థానాలే ఉండేవని ఆయన గుర్తు చేశారు. కానీ, కాలం మారుతూ ఉంటుందని అన్నారు. పార్టీ కార్యకర్తల కృషితో తమకు తొలిసారిగా అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో ప్రధానమంత్రి లభించాడని వివరించారు. కాబట్టి, నిరాశలో కూరుకుపోయి పార్టీ భావజాలాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనానికి తెరలేపాయి. నిజానికి కాంగ్రెస్ విముక్త భారత్ అంటూ బీజేపీ నేతలు తరుచూ చేసే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి.
ఒకవైపు బీజేపీకి ఆప్ నుంచి గట్టి సవాల్ ఎదురవుతున్న సందర్భంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి తోడు కేసీఆర్, మమతా బెెనర్జీ ఫ్రంట్ వ్యూహాలు మరో వైపు జరుగుతూనే ఉన్నాయి.
2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు. యూపీ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 5 అసెంబ్లీ సీట్లు ఉండేవి., ఈ ఎన్నికల్లో Priyanka Gandhi ప్రచారం నిర్వహించినా కూడా ఆ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. అంతేకాదు 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 16 నుండి 31 వరకు ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆగష్టు 21 నుండి సెప్టెంబర్ 20 మధ్య ఎఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.