సీఎం చెంప చెల్లుమనిపించేవాడిని: కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. అరెస్ట్ వారెంట్ జారీ

By telugu teamFirst Published Aug 24, 2021, 12:52 PM IST
Highlights

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని లక్ష్యం చేసుకుని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో సీఎంకు తెలియకపోవడం సిగ్గు చేటని, ఆయన వెనక్కి వంటి ఆంతరంగికుడి ద్వారా తెలుసుకున్నాడని ఆరోపించారు. తాను అక్కడ ఉండి ఉంటే సీఎం చెంప చెల్లుమనిపించేవాడినని నోరుపారేసుకున్నారు. దీనిపై శివసేన, బీజేపీల మధ్య వివాదాన్ని రాజేసింది. బీజేపీ కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. కేంద్రమంత్రికి వ్యతిరేకంగా పోస్టర్లు
అంటించారు.
 

ముంబయి: మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన, ప్రతిపక్ష బీజేపీ మధ్య వివాదం ముదురుతున్నది. మిత్రపక్షాలుగా కొనసాగిన ఈ రెండు పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బద్ధ శత్రువులుగా మారాయి. ఎన్నికలు వచ్చే వరకు ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడుపుతామని ప్రకటించిన శివసేనను అదును చూసి దెబ్బతీసేందుకు బీజేపీ కాచుక్కూచున్నది. ఇప్పటికే పలుఅంశాలపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా వాగ్వాదాలు జరిగాయి. ప్రభుత్వం కూలిపోతుందా అన్నంత స్థాయిలో వివాదాలు జరిగాయి. తాజాగా, వివాదానికి కేంద్రమంత్రి నారాయణ్ రాణే కేంద్రంగా నిలిచారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్రలో ముమ్మరంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆయన కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఇటీవలే రాష్ట్రంలోని పలు ఠాణాల్లో 30కిపైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు శివసేన, బీజేపీల మధ్య వివాదాన్ని రేపాయి. నాగపూర్‌లోని బీజేపీ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. శివసేన యువజన విభాగం యువసేన రాష్ట్రవ్యాప్తంగా కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించింది. చికెన్ దొంగ అంటూ ఆయనను పరోక్షంగా పేర్కొంటూ పోస్టర్లు అంటించింది. నారాయణ్ రాణే శివసేనలో ఉన్నప్పుడు ఐదు దశాబ్దాల క్రితం చెంబూర్‌లో ఆయన పౌల్ట్రీ షాప్ నడిపారు.

జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రాయిగడ్‌లో నిర్వహించిన మీటింగ్‌లో కేంద్ర మంత్రి రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగాన్ని లక్ష్యం చేసుకుని ఆయనపై అనుచితంగా వ్యాఖ్యానించారు. ‘సీఎంకు ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో తెలియదు. ఇది సిగ్గు చేటు. స్వాతంత్ర్యం పొందిన ఎన్నేళ్లు గడిచాయో తెలుసుకోవడానికి ఆయన వెనక్కి వంగి తన ఆంతరంగికుడిని అడిగారు. నేను ఒక వేళ అక్కడ ఉండి ఉంటే, ఆయన చెంప చెల్లుమనిపించేవాడిని’ అని నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నారాయణ్ రాణే ఉన్నట్టుగా భావిస్తున్న చిప్లూన్‌కు పోలీసులు బృందం బయలుదేరినట్టు సమాచారం. కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలియదని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు.

బాల్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ఉన్నప్పుడు నారాయణ్ రాణే శివసేనలో క్రియాశీలకంగా పనిచేశారు. ఇటీవలే ఆయన బీజేపీలోకి మారారు. ప్రధానమంత్రి తాజాగా చేపట్టిన కేంద్రమంత్రి వర్గ ప్రక్షాళనలో నారాయణ్ రాణేకే కేంద్ర మంత్రి పదవిని అప్పజెప్పారు. 

నారాయణ్ రాణే వ్యాఖ్యలపై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ నాయకత్వాన్ని ఇంప్రెస్ చేయడానికి నారాయణ్ రాణే నోటికొచ్చింది వాగుతున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. మోడీ క్యాబినెట్‌లోకి ప్రవేశించినతర్వాత నారాయణ్ రాణే మానసికంగా సమతుల్యాన్ని కోల్పోయాడని విమర్శించారు. మోడీ వెంటనే ఆయనకు గుణపాఠం చెబుతూ మంత్రివర్గం నుంచి బయటికి పంపాలని డిమాండ్ చేశారు. 

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకున్న బీజేపీ, శివసేన సాన్నిహిత్యంగా మెలిగతాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పీఠంపై పేచీతో విడిపోవాల్సి వచ్చింది. రెండున్నరేళ్లు తమకు పీఠం కట్టబెట్టాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జతకట్టి పూర్తిస్థాయి సీఎం పీఠాన్ని శివసేన అందిపుచ్చుకుంది. అప్పటి నుంచి బీజేపీ, శివసేనల మధ్య వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. 

click me!