
Union Home Minister Amit Shah: దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న వారికి ఐదు రోజుల్లో పాస్‌పోర్ట్ ఈ-వెరిఫికేషన్ పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 76వ ఢిల్లీ పోలీస్ రైజింగ్ డేలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నివసిస్తున్న వారికి ఐదు రోజుల్లో పాస్‌పోర్ట్ క్లియరెన్స్ వస్తుందన్నారు. గతంలో మాదిరిగా 15 రోజుల వెయిటింగ్ టైమ్ ఉండదని తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు ఇకపై తమ పాస్‌పోర్ట్ ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో 15 రోజుల్లో పోలీసు క్లియరెన్స్ లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్ల ద్వారా పాస్ పోర్టు వెరిఫికేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. పాస్ పోర్టుల కోసం రోజుకు సగటున 2 వేల దరఖాస్తులు వస్తున్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో ప్రాసెస్ చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయన్నారు.
ఢిల్లీ పోలీసుల 76వ రైజింగ్ డే పరేడ్ లో అమిత్ షా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్, ఎం-పాస్‌పోర్ట్ సేవ ఆన్ లైన్ సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు. పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తామనీ, పాస్‌పోర్ట్ జారీ గడువును 10 రోజులు తగ్గిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో పాస్‌పోర్ట్ జారీ వ్యవస్థలో పోలీస్ వెరిఫికేషన్ అంతర్భాగంగా ఉంటుంది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి వివిధ చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం-పాస్‌పోర్ట్ పోలీస్ యాప్ ను ప్రవేశపెట్టిందని పేర్కొంది.
2023 ఫిబ్రవరి 16 న, ఢిల్లీ పోలీసు రైజింగ్ డే సందర్భంగా, కేంద్ర హోం మంత్రి 350 మొబైల్ టాబ్లెట్లను స్పెషల్ బ్రాంచ్ / ఢిల్లీ పోలీసు సిబ్బందికి అందించారు. దీంతో పోలీస్ వెరిఫికేషన్, సబ్మిషన్ రిపోర్టు మొత్తం డిజిటల్, పేపర్ లెస్ గా జరుగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్యాబ్లెట్లను ఉపయోగించి వెరిఫికేషన్ ప్రక్రియ వెరిఫికేషన్ సమయాన్ని 15 రోజుల నుండి 5 రోజులకు తగ్గిస్తుందనీ, ఇది పౌర సేవలను మెరుగుపరిచే దిశగా గొప్ప ముందడుగుగా పేర్కొంది. పాస్ పోర్టు జారీ గడువు 10 రోజులు తగ్గనుందని కూడా తెలిపింది.