PM Modi inaugurates 6G Research Centre: దేశ రాజధాని ఢిల్లీలో 6జీ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 6జీ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన ప్రధాని, నేటి భారతదేశం డిజిటల్ విప్లవ తదుపరి దశ వైపు వేగంగా కదులుతోందని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలో నూతన అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి.. రాబోయే కొన్నేళ్లలో దేశంలో 6Gని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సూచన చేశారు. ఈ క్రమంలోనే భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. "నేటి భారతదేశం డిజిటల్ విప్లవం తదుపరి దశ వైపు వేగంగా కదులుతోంది. కేవలం 120 రోజుల్లో 125 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని సుమారు 350 జిల్లాలకు 5జీ సేవలు చేరాయని" తెలిపారు. 5జీ అందుబాటులోకి వచ్చిన 6 నెలల తర్వాత దేశం 6జీ దిశగా పనిచేస్తోందన్నారు. నేడు సమర్పించిన విజన్ డాక్యుమెంట్ రాబోయే కొన్నేళ్లలో 6జీ విడుదలకు ప్రధాన ప్రాతిపదికగా మారనుందని పేర్కొన్నారు.
ఐటీయూ ఐక్యరాజ్యసమితి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ప్రత్యేక సంస్థ. జెనీవాలో ప్రధాన కార్యాలయంగా ఉండగా, దీనికి ప్రపంచవ్యాప్తంగా క్షేత్ర, ప్రాంతీయ కార్యాలయాలు, ఏరియా కార్యాలయాల నెట్ వర్క్ ను కలిగి ఉంది. ఏరియా ఆఫీస్ ఏర్పాటు కోసం 2022 మార్చిలో ఐటీయూతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. దేశంలో 6జీ కోసం రోడ్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, పరిశోధన-అభివృద్ధి సంస్థలు, విద్యా సంస్థలు, ప్రామాణిక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, పరిశ్రమల సభ్యులతో 2021 నవంబర్ లో ఏర్పాటైన టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ 6జీ (టీఐజీ-6జీ) భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తాయి.
6జీ టెస్ట్ బెడ్ ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలు మొదలైన వాటికి అభివృద్ధి చెందుతున్న ఐసీటీ టెక్నాలజీలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి ఒక వేదికగా ఉంటుంది. భారత్ 6జీ విజన్ డాక్యుమెంట్, 6జీ టెస్ట్ బెడ్ దేశంలో ఇన్నోవేషన్, కెపాసిటీ బిల్డింగ్, వేగవంతమైన టెక్నాలజీ అడాప్షన్ కు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. భారతదేశ అనుకూలమైన విధాన వాతావరణమే వేగవంతమైన అభివృద్ధికి కారణమని ఆయన నొక్కి చెప్పారు. భారత్ కు విశ్వాసం, స్కేల్ అనే రెండు కీలక బలాలు ఉన్నాయని పేర్కొంటూ.. నమ్మకం, స్థాయి లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని మూలలకు తీసుకెళ్లలేమని అన్నారు. అయితే, ఈ దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోందని తెలిపారు.
5జీ శక్తితో యావత్ ప్రపంచం పని సంస్కృతిని మార్చడానికి భారతదేశం అనేక దేశాలతో కలిసి పనిచేస్తోందని మోడీ అన్నారు. 5జీ స్మార్ట్ క్లాస్ రూమ్ లు, వ్యవసాయం, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్స్, హెల్త్ కేర్ అప్లికేషన్స్ ఇలా అన్ని రంగాల్లోనూ భారత్ వేగంగా పనిచేస్తోందన్నారు. జన్ ధన్, ఆధార్, మొబైల్ (జేఏఎన్) అనే మూడు స్తంభాలు భారత్ టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటోందనడానికి నిదర్శనమన్నారు. భారతదేశానికి టెలికాం సాంకేతికత ఒక శక్తి సాధనం కాదనీ, సాధికారత కోసం ఒక మిషన్ అని ప్రధాని అన్నారు. దేశంలో శరవేగంగా జరుగుతున్న డిజిటలైజేషన్ గురించి కూడా ప్రస్తావించారు.