ఆ ట్వీట్లు తొలగించకపోతే... ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం

By Siva KodatiFirst Published Feb 3, 2021, 5:20 PM IST
Highlights

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై భగ్గుమంది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.   

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై భగ్గుమంది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.   

కాగా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖ గత సోమవారం పేర్కొంది.

అలాంటి ఖాతాలను నిలిపివేయాలని, ఆ ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 100 ఖాతాలను నిలిపివేయడంతో పాటు 150 ట్వీట్లను తొలగించింది. వీటిలో కిసాన్‌ ఏక్‌ మోర్చా, బీకేయూ ఖాతాలు కూడా ఉన్నాయి.  

అయితే కొన్ని గంటల తర్వాత బ్లాక్‌ చేసిన అకౌంట్లను/ట్వీట్లను ట్విటర్‌ పునరుద్ధరించింది. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ప్రభుత్వ అనుమతి లేకుండానే ట్విటర్‌ ఏకపక్షంగా ఖాతాలను పునరుద్ధరించిందని.. ఇది ఒక మాధ్యమం మాత్రమేనని, తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.

తమ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం నోటీసుల్లో స్పష్టం చేసింది. మార‌ణ‌హోమాన్ని ప్రేరేపించ‌డం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కాద‌ని, అది శాంతి భద్రతలకు ముప్పు అవుతుంద‌ని ప్రభుత్వం పేర్కొంది.

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రైతుల ఆందోళనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

click me!