ఎగుమతి రంగానికి కేంద్రం భారీ ఊరట.. రూ. 56వేల కోట్ల విడుదల చేస్తున్నట్టు ప్రకటన

By telugu teamFirst Published Sep 9, 2021, 8:27 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఎగుమతి రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఎగుమతులకు ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పలు పథకాల కింద ఎగుమతిదారుల కోసం రూ. 56,027 కోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదిలోనే నిధులు లబ్దిదారులకు చేరుతాయని కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ వివరించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎగుమతి రంగానికి భారీ ఊరటనిచ్చింది. ఎగుమతి ప్రోత్సాహకాల పథకాలకు సంబంధించి పెండింగ్ పన్ను బకాయిలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రూ. 56,027 కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ నిధులను 45వేల ఎగుమతిదారులకు అందించనున్నట్టు కామర్స్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 98శాతం ఎంఎస్ఎంఈ కేటగిరీకి చెందిన చిన్న ఎగుమతిదారులే ఉన్నట్టు వివరించింది.

రూ. 56,027 కోట్ల నిధులను ఈ ఏడాదే పంపిణీ చేయనున్నట్టు కేంద్ర కామర్స్ శాఖ మంత్రి పియూశ్ గోయల్ ప్రకటించారు.

ఆర్‌వోడీటీఈపీ స్కీం కింద రూ. 12,454 కోట్లు, ఆర్‌వోఎస్‌సీటీఎల్ స్కీం కింద రూ. 6,946 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎగుమతిదారుల కోసం ప్రకటించింది. వీటికి అదనంగా తాజాగా రూ. 56,027 కోట్లను ప్రకటించడం గమనార్హం.

ఎగుమతిరంగంలో నగదు చలమాణిలో ఉండటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి గోయల్ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతి డిమాండ్లను అందుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆర్థిక దన్నుతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఉపాధి సృష్టి ఒకటి అని వివరించింది.

click me!