ఈ రెండు బ్యాంకుల చెక్ బుక్కులు వచ్చే నెల నుంచి చెల్లవు

By telugu teamFirst Published Sep 9, 2021, 4:36 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల చెక్ బుక్‌లు వచ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లవని వెల్లడించింది. కాబట్టి, అంతలోపే వీటి స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్‌లను తీసుకోవాల్సిందిగా సూచించింది.
 

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)ల చెక్ బుక్‌లు వచ్చే నెల నుంచి చెల్లవని స్పష్టం చేసింది. వాటిని వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్ బుక్‌లతో భర్తీ చేసుకోవాలని ట్వీట్ చేసింది. వినియోగదారులందరూ ఈ తమ చెక్ బుక్‌లను పీఎన్‌బీ చెక్ బుక్‌లతో మార్చుకోవాలని సూచించిది.

ఓబీసీ, యూబీఐ బ్యాంకులు గతేడాది ఏప్రిల్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. కానీ, వాటి చెక్ బుక్‌లు ఇంకా కొనసాగుతున్నాయి.

‘2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈఓబీసీ, ఈయూఎన్ఐ పాత చెక్ బుక్‌లు చెల్లవు. కాబట్టి, ఈవోబీసీ, ఈయూఎన్ఐ చెక్ బుక్‌ల స్థానంలో పీఎన్‌బీ చెక్ బుక్‌లను తీసుకోవాలి. అప్‌డేట్ అయిన ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ నంబర్‌లతో ఈ చెక్ బుక్‌లను తీసుకోవాలి’ పీఎన్‌బీ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది.

వీటిని నేరుగా బ్యాంకు బ్రాంచిని సంప్రదించి తీసుకోవచ్చని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. లేదంటే పీఎన్‌బీ వన్ కస్టమర్ కేర్ ద్వారా కూడా కొత్త చెక్ బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఏవైనా వివరాలు లేదా సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-2222ను సంప్రదించాలని సూచించింది.

click me!