టీకాతో కరోనా మరణాలు నివారించవచ్చు.. 96.6శాతం అడ్డుకుంటున్నది: కేంద్రం

By telugu teamFirst Published Sep 9, 2021, 6:11 PM IST
Highlights

ప్రజలందరూ కరోనా టీకా వేసుకోవాలని, అవి ప్రాణాలు పోకుండా కాపాడుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరణాలను నివారించడంలో తొలి డోసు 96.6 శాతం సమర్థతో, రెండు డోసులు 97.5 శాతం సమర్థతో పనిచేస్తున్నాయని తెలిపింది.
 

న్యూఢిల్లీ: కరోనా టీకా ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సింగిల్ డోసుతో కరోనా మరణాలను 96.6శాతం నివారించవచ్చునని, రెండు డోసులు వేసుకుంటే అవి 97.5శాతం రక్షణంగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య వివరాలను పేర్కొంటూ కేంద్రం ఈ అంచనాకు వచ్చింది. 

టీకాలు మరణాలను నివారిస్తాయని, సెకండ్ వేవ్‌ విలయతాండవం చేసినప్పుడు ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో మరణించిన అత్యధికులు టీకా వేసుకోనివారేనని కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే పాల్ వివరించారు. వైరస్ నుంచి కాపాడే ముఖ్యమైన కవచం టీకాలేనని స్పష్టం చేశారు.

‘టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ టీకా వేసుకోవాలని కోరుతున్నాం. తొలి డోసు వేసుకున్న తర్వాతే రెండో డోసు వేస్తారు. ఇవి కరోనా నుంచి మరణించకుండా కాపాడుతాయి’ అని డాక్టర్ వీకే పాల్ వివరించారు. టీకా వేసుకున్నప్పటికీ మళ్లీ కరోనా సోకడానికి అవకాశం ఉంటుందని, కానీ, సదరు పేషెంట్ హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితులను టీకా తగ్గిస్తాయని, వీరిలో మరణాలనూ నివారిస్తుందని డాక్టర్ వీకే పాల్ చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో చిన్నారుల మరణాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ మరణాలకు కారణం డెంగ్యూ అని వీకే పాల్ వెల్లడించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా మసులుకోవాలని సూచించారు. డెంగ్యూతో తీవ్ర పరిణామాలు ఉంటాయని, దానికి టీకా లేదని వివరించారు. కాబట్టి, కరోనాతోపాటుగా ఇలాంటి వ్యాధులతోనూ పోరాడాల్సి ఉంటుందని చెప్పారు.

click me!