Agnipath Protest: చల్లారని ఆందోళనలు.. అగ్నివీర్లకు కేంద్రం ఆఫర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు

Published : Jun 18, 2022, 07:30 PM IST
Agnipath Protest: చల్లారని ఆందోళనలు.. అగ్నివీర్లకు కేంద్రం ఆఫర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు

సారాంశం

అగ్నిపథ్ స్కీంపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకారులను ఉపశమనపరిచే వార్తలు తెలిపాయి. అగ్నివీర్లు నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత తమ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో చేర్చుకుంటామని, లేదా ఆ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నాయి.

న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలో కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసులో ఉంటే ఆ తర్వాత ఏం చేయాలనే పెద్ద ప్రశ్నను లేవదీస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఉద్యోగ భద్రత ప్రధానంగా ఈ ఆందోళనల వెనుక కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆందోళనలు తగ్గించే పనిలో పడ్డట్టు తెలుస్తున్నది. ఎందుకంటే.. అగ్నిపథ్ స్కీం ద్వారా నియామకమై నాలుగేళ్ల సర్వీసు ఆర్మీలో పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు తమ శాఖలో ఉద్యోగం కల్పిస్తామంటూ కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రకటనలు చేస్తున్నాయి. కాగా, కొన్నిబీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఆ వివరాలను ఓ సారి పరిశీలిద్దాం.

పదో తరగతి పాస్ అయిన అగ్నివీర్లు 12వ తరగతి పాస్ కావడానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌ను కేంద్రం ప్రారంభించబోనుంది. వారి గ్రాడ్యుయేషన్‌లోనూ అగ్నివీర్లు పొందిన శిక్షణణు క్రెడిట్లుగా గుర్తిస్తుందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది.  సివిలియన్ కెరీర్‌ల కోసం అగ్నివీర్ల కోసం ఇగ్నో యూనివర్సిటీ ప్రత్యేక డిగ్రీ కోర్సులను అందిస్తుంది. సర్వీసులో ఉండగానే స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ అందించనున్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్లు అగ్నివీర్లకు తగిన రుణ వసతి కల్పించడానికి మద్దతుగా ఉంటాయి. కార్పొరేట్ సంస్థలూ వారిని రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది.

హోం శాఖ: 
అగ్నివీర్లకు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ తొలిగా స్పందించింది. కేంద్ర బలగాలు(సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, తొలి బ్యాచ్ అగ్నివీర్లకు గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల వరకు సడలిస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.

రక్షణ శాఖ: 
హోం శాఖ ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమ్మతి తెలిపారు. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌లోనూ పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించారు. కోస్టు గార్డు ఉద్యోగాల్లోనూ పది శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.

పౌర విమానయాన శాఖ: 
అగ్నివీర్లను తమ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో చేర్చుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ సర్వీసెస్, మెయింటెనెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఒవర్‌హాల్, మెటీయరలాజికల్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సర్వీసులు మొదలగు వాటిలో నియామకాల్లో అగ్నివీర్లను చేర్చుకుంటామని తెలిపింది.

హౌజింగ్, పెట్రోలియం శాఖ:
ఈ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లలో అగ్నివీర్లను రిక్రూట్ చేసుకుంటామని కేంద్రం మంత్రి హర్దీప్ పురి వెల్లడించారు. ఇది గొప్ప స్కీం అని, తమ శాఖలోని పీఎస్‌యూల్లో అగ్నివీర్ల నైపుణ్యాలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

షిప్పింగ్ మినిస్ట్రీ:
అగ్నివీర్లను ఆరు సర్వీస్ అవెన్యూల్లో చేర్చుకుంటామని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెర్చంట్ నేవీలో జాయిన్ చేసుకుంటామని తెలిపింది.

కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అగ్నివీర్లకు నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ప్రాధాన్యతతో పోలీసు శాఖల్లో చేర్చుకుంటామని వెల్లడించాయి.

ఉత్తరాఖండ్:
నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అగ్నివీర్లకు రాష్ట్ర పోలీసు శాఖ, విపత్తు నిర్వహణ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

ఉత్తరప్రదేశ్: 
రాష్ట్ర పోలీసు, దాని అనుబంధ శాఖల్లో నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు.

మధ్యప్రదేశ్:
రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.

కర్ణాటక:
రాష్ట్ర పోలీసు శాఖ నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వెల్లడించారు.

వీటితోపాటు, అసోం, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలో నియామకాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?