UCC : ఉత్తరాఖండ్ లో అమల్లోకి రానున్న యూనిఫాం సివిల్ కోడ్.. ఎప్పటి నుంచి అంటే..

By Asianet News  |  First Published Nov 11, 2023, 1:58 PM IST

Uniform Civil Code : ఉత్తరాఖండ్ లో వచ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి రానుంది. దీపావళి అనంతరం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 


Uniform Civil Code : ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ విషయంలో రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి నివేదిక ఇవ్వనుంది.

ఉత్తరాఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని దీపావళి మరుసటి వారం నిర్వహించనున్నారు. అందులో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ఆమోదం పొందనుంది. దీంతో ఆ బిల్లుకు చట్టబద్ధత లభిస్తుంది. ఈ ఏడాది జూన్ లో ఉత్తరాఖండ్ కు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా రూపకల్పన పూర్తయిందని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ముసాయిదా కమిటీ సభ్యురాలు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ తెలిపారు.

Latest Videos

ఉత్తరాఖండ్ లో ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా రూపకల్పన పూర్తయిందని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదికతో పాటు ముసాయిదాను ముద్రించి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. 

కాగా.. ఉత్తరాఖండ్ బాటలోనే గుజరాత్ కూడా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తున్న రెండో రాష్ట్రంగా గుజరాత్ అవతరించనుంది.
 

click me!