దీపావళి 2023 : పటాకులు పేల్చడానికి రాష్ట్రాల వారీగా ఉన్న నియమాలివే...

By SumaBala Bukka  |  First Published Nov 11, 2023, 1:31 PM IST

దీపావళి రోజున, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు పటాకులు పేల్చడానికి పరిమిత సమయం ఇచ్చింది.


ఢిల్లీ : దీపావళి అనగానే గుర్తుకువచ్చేవి అందమైన రంగోళీలు, స్వీట్లు, బాణాసంచా శబ్దాలు. అయితే గత కొన్నేళ్లుగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో అధికారులు పటాకులు కాల్చడంపై నిషేధం విధించారు. ఈ ఏడాది కూడా దీపావళి రోజున బాణాసంచా కాల్చడం నిషేధమని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ, బేరియం, ఇతర నిషేధిత రసాయనాలతో నింపిన వాటికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

ఈ ఉత్తర్వుల తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి రోజు కొన్ని సడలింపులను ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఏ రకమైన పటాకులను అనుమతించాలో నియమాలు ఏర్పాటు చేశాయి. 

Latest Videos

చంద్రయాన్-3 పంపే సమాచారం కోసం అమెరికా, రష్యా ఎదురు చూపు - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

దీపావళి రోజున పటాకులు కాల్చడానికి రాష్ట్రాల వారీగా ఉన్న నియమాలు ఇవే..

పంజాబ్ : దీపావళి పండుగ సీజన్‌లో గ్రీన్ క్రాకర్స్ అమ్మొచ్చని, కాల్చుకోవచ్చని భగవంత్ మాన్ ప్రభుత్వం అనుమతించింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, గురుపర్వ్‌లో ఉదయం 4 నుంచి 5 గంటల వరకు, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు భక్తులు పటాకులు కాల్చవచ్చని పర్యావరణ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హయర్ తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాత్రి 11.55 నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు పటాకులు కాల్చేందుకు అనుమతిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల్లో కూడా ఇదే నియమాన్ని పాటించనున్నారు. చోర్సా గార్లాండ్ పటాకులను నిషేధిస్తామని, అలాగే అన్ని క్రాకర్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని మంత్రి తెలిపారు.

ఉత్తరప్రదేశ్ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో పోలీసులు పటాకుల అమ్మకాలపై నిషేధం విధించారు. సంతృప్తికర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైతేనే గ్రీన్ క్రాకర్స్ విక్రయించేందుకు అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీ : శీతాకాలంలో కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు 2024 జనవరి 1 వరకు నగరంలో గ్రీన్ క్రాకర్స్ తో సహా పటాకుల తయారీ, నిల్వ, అమ్మకం, కాల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గరినుంచి పోలీసులు ఇటీవలే 40 కిలోల బాణసంచా స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు (ఐబి), నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)కి ఐదు కిలోమీటర్ల పరిధిలో పటాకుల అమ్మకం, వాడకంపై జమ్మూ కాశ్మీర్ పరిపాలన నిషేధం విధించింది.

తెలంగాణ : దీపావళి రోజున హైదరాబాద్‌లో పోలీసులు కేవలం రెండు గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతి ఇచ్చారు. ఈ రెండు గంటల్లో బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే శబ్దం అనుమతించదగిన పరిమితిలోపు ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంక్షలు నవంబర్ 12 (ఆదివారం) ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

మహారాష్ట్ర : రాష్ట్రంలో పటాకులు కాల్చడంపై నిషేధం లేదు. దీపావళి రోజున రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటల పాటు బాణసంచా కాల్చేందుకు బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది.

తమిళనాడు : దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ పేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా, దేశ బాణసంచా రాజధానిగా పరిగణించబడే శివకాశిలోని బాణసంచా తయారీదారులు - బేరియం క్లోరైడ్‌ను వాడడం మానేసి, సుప్రీంకోర్టు ఆమోదించిన సూత్రానికి కట్టుబడి గ్రీన్ క్రాకర్‌లకు మారారు. అయితే అసంఘటిత రంగంలో ఇంకా ఇవి వాడుతున్నారు. వాటిని నియంత్రించడమే పెను సవాలుగా ఉంది. 

పశ్చిమ బెంగాల్ : గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీపావళి రోజున రాత్రి 8 నుండి 10 గంటల వరకు.. ఛత్ పూజలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు రెండు గంటల సమయం కూడా ఉంటుంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలలో గ్రీన్ క్రాకర్స్ పేల్చడానికి  35 నిమిషాల పాటు, రాత్రి 11:55 నుండి 12:30 వరకు అనుమతి ఉంటుంది.

click me!