జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే

By Galam Venkata RaoFirst Published Aug 16, 2024, 3:50 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. 

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. జమ్మూ కశ్మీర్ (J&K), హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని శుక్రవారం ప్రకటించింది. ఆ తర్వాత అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2019లో మహారాష్ట్ర, జార్ఖండ్‌లతో పాటు హరియాణాలో ఎన్నికలు జరిగాయి. 

కాగా, జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. హరియాణాలో అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి.

Latest Videos

జమ్మూకశ్మీర్‌లో ప్రజల్లో ఎంతో ఉత్సాహం ఉందని, వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. “సాధ్యమైనంత త్వరగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో జమ్మూ కశ్మీర్‌లోని పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న పొడవాటి క్యూలు ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా అందులో భాగమై తమ గళాన్ని కూడా పెంచాలనుకుంటున్నారనడానికి నిదర్శనం. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు తమ విధిని తామే రాసుకోవాలనుకుంటున్నారు’’ అని రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని... మహిళలు, యువత సహా ఓటర్లందరూ తరలి వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

పోలీసు, పబ్లిక్ ఆర్డర్ నుంచి పోస్టింగ్‌లు, ప్రాసిక్యూషన్ ఆంక్షల వరకు జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఈ ప్రక్రియ జరిగిన నెల రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. దీన్ని జమ్మూ కశ్మీర్‌లో ప్రతిపక్షాలు ఖండించాయి. ముఖ్యమంత్రిని శక్తిహీనులుగా మార్చడానికి మరియు ప్రాంత ప్రజలను నిర్వీర్యం చేసే చర్యగా పేర్కొంటూ ఈ చర్యను ఖండించాయి.

 

click me!