
కరోనా మహమ్మారితో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి సామాన్యులు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే వర్తక, వాణిజ్యాలు గాడినపడుతున్నప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా కారణంగా గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) (pm garib kalyan anna yojana) పథకం గడువును మరో ఆర్నెళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘భారతదేశ బలం దేశంలోని ప్రతి పౌరుడి శక్తిలో ఉంది. ఈ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజనను మరో ఆర్నెళ్ల పాటు అంటే సెప్టెంబర్ 2022 వరకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మాదిరే దేశంలోని 80 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు’’ అని మోడీ పేర్కొన్నారు.
పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. దేశవ్యాప్తంగా COVID 19 మహమ్మారి లాక్‌డౌన్ మధ్య పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం మొదట ఏప్రిల్ 2020 నుండి మూడు నెలల పాటు ప్రారంభించింది. అప్పటి నుంచి పలుమార్లు పొడిగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే 5 కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో PMGKAY మార్చి 2022 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ గడువు ముగియనుండటంతో మరో ఆరు నెలలు పెంచింది.