అంబులెన్స్ ఎక్కలేని స్థితిలో భర్త.. సహాయం కోసం వేడుకున్న భార్య..

By telugu news teamFirst Published Jul 27, 2020, 8:58 AM IST
Highlights

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆయన వయసు ఎక్కువగా ఉండటం.. అనారోగ్యం కారణంగా కనీసం అంబులెన్స్ కూడా ఎక్కలేకపోయాడు. అతనిని అంబులెన్స్ ఎక్కించడానికి భార్య తన శాయశక్తులా ప్రయత్నించింది. 

కరోనా మహమ్మారి కారణంగా.. ప్రజల్లో మానవత్వం చచ్చిపోయిందా అనే అనుమానం రోజు రోజుకీ బలంగా పెరిగిపోతోంది. కళ్ల ఎదురుగా.. మనిషి ప్రాణం పోతున్నా.. కనీసం సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎక్కడ తమకు కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో కనీసం స్పందించడం లేదు. ఇలాంటి తాజా సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం  బాన్గాన్ ప్రాంతానికి చెందిన మాధవ్ నారాయణ దత్త(68) శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో.. అతనిని చికిత్స నిమిత్తం భార్య స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకువచ్చింది. అతనికి కరోనా లక్షణాలు ఉండటంతో కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే.. పరిస్థితి విషమిస్తుండటంతో అతనిని రాత్రి 8గంటల సమయంలో కోల్ కతాలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. కోల్ కతా అక్కడి నుంచి దాదాపు 80కిలోమీటర్ల దూరంలో ఉంది. అతనిని తరలించడానికి అంబులెన్స్ కూడా సిద్ధం చేశారు.

అయితే.. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆయన వయసు ఎక్కువగా ఉండటం.. అనారోగ్యం కారణంగా కనీసం అంబులెన్స్ కూడా ఎక్కలేకపోయాడు. అతనిని అంబులెన్స్ ఎక్కించడానికి భార్య తన శాయశక్తులా ప్రయత్నించింది. అయినా.. ఆమె ప్రయత్రం ఫలించలేదు. అతనిని అంబులెన్స్ ఎక్కించడం ఆమె వల్ల కాలేదు.

దీంతో.. సాయం కోసం ఆమె అందరినీ అభ్యర్థించింది. కానీ.. అందరూ చూస్తూ ఉండిపోయారు కానీ.. ఎవరూ కనీసం సహాయం చేయడానికి కూడా రాలేదు. అతనికి కరోనా ఉందనే అనుమానంతో కనీసం ఎవరూ దగ్గరకు కూడా రాలేదు.

అక్కడే ఓ వ్యక్తి పీపీఈ కిట్ కూడా వేసుకొని ఉన్నాడు. అతను కూడా ముందుకు రాకపోవడం బాధాకరం. అతను ఆ అంబులెన్స్ డ్రైవర్ కావడం గమనార్హం. బాధితుడి భార్య... అతనిని కూడా వేడుకుంది. నువ్వు పీపీఈ కిట్ ధరించి ఉన్నావు కదా.. నువ్వైనా సహాయం చేయమని ఆమె గుండెలు అవిసేలా ఏడ్చింది. కానీ.. ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం. దాదాపు అరగంట పాటు అతను ప్రాణాలతో పోరాడి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

click me!