కరోనాతోనే దేశాల మధ్య విశ్వాసాలు సన్నగిల్లాయి. ఉక్రెయిన్ యుద్ధం ఈ అవిశ్వాస సంక్షోభాన్ని మరింత లోతుకు తీసుకెళ్లింది. దీన్ని విశ్వాసంగా మార్చాలని జీ20 ప్రెసిడెంట్‌గా భారత్ పిలుపు ఇస్తున్నది అని ఈ రోజు జీ 20 సదస్సులో సభ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓపెనింగ్ రిమార్క్స్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అపనమ్మకం బలంగా వేళ్లూనుకుందని తెలిపారు. ఇప్పుడు ఈ అపనమ్మకాన్ని ఒక దేశం పై మరో దేశానికి విశ్వాసంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు ఇచ్చారు.
ఈ 21వ శతాబ్దం ప్రపంచానికి ఒక కొత్త దిశ చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అనాదిగా వస్తున్న అనేక సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. కాబట్టి, మానవీయ కోణంలో బాధ్యతలు నెరవేరుస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
‘కొవిడ్ 19 తర్వాత ప్రపంచంలో విశ్వాస సంక్షోభం ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం ఈ అపనమ్మకాలను మరింత లోతుకు తీసుకెళ్లింది. దీంతో దేశాల మధ్య అవిశ్వాసాలే ఉన్నాయి. మనం కరోనాను ఓడించినట్టే ఈ విశ్వాస సంక్షోభంపైనా విజయాన్ని సాధించాల్సి ఉన్నది’ అని ప్రధాని మోడీ వివరించారు.
Also Read: దూకుడు పెంచిన ఇండియా కూటమి.. కో ఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?
‘జీ 20కి ప్రెసిడెంట్‌గా భారత్ ఒక ముఖ్యమైన పిలుపు ఇస్తున్నది. ఈ అంతర్జాతీయ విశ్వాస లోపాన్ని పూడ్చుకుని ఒకరిపై మరొకరి విశ్వాసంగా మార్చుకోవాలని సూచిస్తున్నది. అందరం కలిసి పని చేసే సమయం ఆసన్నమైంది’ అని ప్రధాని తెలిపారు.
భారత్‌లో జీ 20 ప్రజల జీ20గా మారిందని ప్రధాని మోడీ అన్ని దేశాల ప్రతినిధులను ఉద్దేశిస్తూ చెప్పారు. దేశవ్యాప్తంగా 60కిపైగా నగరాల్లో 200కు పైగా జీ20 కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు.