
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం జీ20 సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘భారత్’ అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ వెనకాల కూర్చున్నారు. దేశ వ్యాప్తంగా 'ఇండియా వర్సెస్ భారత్' అనే రాజకీయ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘భారత్’ పేరు అధికారికంగా ప్రదర్శించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ప్రధాని ముందగా ప్రారంభోపన్యాసం చేశారు. తన ప్రసంగంలో మొదట 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అని అన్నారు. ‘‘నేడు జీ20 దేశాల అధ్యక్షుడిగా భారత్ ప్రపంచ విశ్వాస లోటును విశ్వాసం, విశ్వసనీయతగా మార్చాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది. మనమందరం కలిసి ముందుకు సాగాల్సిన సమయం ఇది. ఈ సమయంలో 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' అనే మంత్రం మనకు దిక్సూచి కాగలదు.’’ అని అన్నారు.
ఉత్తర, దక్షిణాల మధ్య విభజన, తూర్పు, పడమరల మధ్య దూరం, ఆహారం, ఇంధనం నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రత వంటివాటికి భవిష్యత్ తరాల కోసం పటిష్టమైన పరిష్కారం కనుగొనాల్సి ఉందని ప్రధాని మోడీ సూచించారు. ‘‘భారత జీ20 సదస్సు దేశం లోపల, వెలుపల 'సబ్ కా సాత్'కు చిహ్నంగా మారింది. ఇది భారతదేశంలో ప్రజల జీ20 గా మారింది. దేశవ్యాప్తంగా 200కి పైగా సమావేశాలు జరిగాయి’’ అని ప్రధాని మోడీ అన్నారు.
కాగా.. ప్రధాని మోడీ ఈ ప్రారంభోపన్యాసం చేయడానికి ముందు.. జీ20 శిఖరాగ్ర సమావేశ వేదిక అయిన భారత్ మండపంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యుకె ప్రధాని రిషి సునక్తో సహా అనేక మంది ప్రపంచ నాయకులకు స్వయంగా స్వాగతం పలికారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ క్రిస్టలీనా జార్జివా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో-ఇవెలా ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన వేదికకు చేరుకున్నారు. కాలం, పురోగతి, నిరంతర మార్పులకు ప్రతీకగా నిలిచే 13వ శతాబ్దపు కళాఖండం కోణార్క్ చక్రం ప్రతిరూపం వద్ద మోడీ ప్రపంచ నాయకులకు స్వాగతం పలుకారు.