
Udaipur Murder Case: ఉదయపూర్ హత్య కేసులో మరో నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. కన్హయ్య లాల్ హత్య కేసులో నిందితుడైన ఫర్హాద్ మహ్మద్ షేక్ (31) అలియస్ బాబ్లా ను ఆదివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రియాజ్ అటారీకి సన్నిహితుడని, కన్హయ్య లాల్ హత్యకు కుట్రలో చురుగ్గా పాల్గొన్నాడని ఎన్ఐఏ తెలిపింది. గతంలో ఈ కేసులో ఆరుగురు నిందితులను జూన్ 29, జూలై 1, జూలై 4 తేదీల్లో అరెస్టు చేశారు. తాజాగా ఏడో నిందితుడుగా ఫర్హాద్ మహ్మద్ షేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా ఎన్‌ఐఏ పట్టుకున్న నిందితుడు.. కన్హయ్య లాల్ ను హత్య చేయడంలో రియాజ్, గౌస్ మహ్మద్‌లకు మద్దతు ఇచ్చాడు. అంతే కాకుండా హత్య కుట్రలో బాబ్లా కూడా కీలక పాత్ర వహించారు. విశేషమేమిటంటే.. హత్య జరిగిన మరుసటి రోజే విచారణ నిమిత్తం.. బాబ్లాను కస్టడీలోకి తీసుకున్నా.. ఆపై అతడు విడుదలయ్యాడు. ఇప్పుడు అతడిని రెండు మూడు రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది.
ఉదయపూర్‌లో కన్హయ్యలాల్ హత్య
జూన్ 28 న..ఉదయపూర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఉదయ్‌పూర్‌కు చెందిన కన్హయ్య లాల్ అనే టైలర్ పై ఇద్దరూ మతోన్మాదులు దాడికి తెగబడ్డారు. అత్యంత క్రూరంగా ఆ టైలర్ తల నరికి చంపారు.
ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియోను నిందితులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీని సైతం బెదిరించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. శాంతిభద్రతలను కాపాడటం కోసం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు.
ఎన్‌ఐఏ దర్యాప్తు
అనంతరం హత్యకు సంబంధించిన వీడియోను నిందితుడు వైరల్ చేశాడు. నిందితులిద్దరినీ రాజస్థాన్ పోలీసులు ఒకే రోజు అరెస్టు చేశారు. అనంతరం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.