
Jammu Kashmir: జమ్ము-కాశ్మీర్ లో తీవ్రవాదుల సంస్థల్లో చేరే యువకుల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం.. గత నాలుగేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలు.. దాదాపు 700 మంది యువకులను రిక్రూట్ చేసుకున్నాయి. ప్రస్తుతం వారిలో 141 మంది క్రియాశీలంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విదేశీయులేననీ తెలిపింది. జమ్మూ, కాశ్మీర్‌లో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల ఉనికి అధికంగా ఉందనీ, ఉగ్రవాద శిబిరాల నుండి చొరబాట్లను కొనసాగుతున్నాయని తెలిపింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. జూలై 5, 2022 తేదీ వరకు.. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 82 మంది విదేశీ ఉగ్రవాదులు, 59 మంది స్థానిక ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారు. దీనికి సంబంధించి, డేటాను ఉటంకిస్తూ.. ఈ ఉగ్రవాదులు ప్రధానంగా లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందినవారని వెల్లడైంది.
వివిధ ఉగ్రవాద సంస్థలు గత నాలుగేళ్లలో J&Kలో 700 మంది స్థానిక యువకులను రిక్రూట్ చేశాయి, అందులో 187 మందిని 2018లో, 121 మందిని 2019లో, 181 మందిని 2020లో, 142 మందిని 2021లో నియమించారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు 69 మంది యువకులను ఉగ్రవాద సంస్థలు రిక్రూట్ చేసుకున్నాయి.
అదే సమయంలో.. ఈ ఏడాది ఇప్పటివరకు 55 ఎన్‌కౌంటర్లలో 125 మంది ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి. అదేసమయంలో ఇప్పటి వరకు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 23 మంది గాయపడ్డారు. అలాగే.. జమ్మూ కాశ్మీర్‌లో 20 మంది పౌరులు కూడా మరణించారు. దీంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్ లో ఎనిమిది గ్రెనేడ్ దాడులు జరిగాయి.
డేటా ప్రకారం.. 2021లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటనల్లో 146 మంది ఉగ్రవాదులు, 41 మంది పౌరులు మరణించారు. ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జరిగిన ఉగ్రవాద ఘటనల్లో మొత్తం 63 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.