ఒడిశాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి..

By Sumanth KanukulaFirst Published Nov 24, 2022, 5:31 PM IST
Highlights

ఒడిశాలోని బలంగీర్ జిల్లా గంధమార్ధన్ కొండల్లో భద్రతా సిబ్బందికి, మావోయిస్టుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. 

ఒడిశాలోని బలంగీర్ జిల్లా గంధమార్ధన్ కొండల్లో భద్రతా సిబ్బందికి, మావోయిస్టుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు ధ్రువీకరించారు. వివరాలు.. ఒడిశాలోని ఎలైట్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ), బోలంగీర్ జిల్లా స్వచ్ఛంద దళం (డీవీఎఫ్) భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో ఉండగా ఖప్రఖోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ మహాదేవ్ ఆలయానికి సమీపంలోని అడవిలో మావోయిస్టుల శిబిరాన్ని గుర్తించారు. ఆ  తర్వాత అక్కడ కాల్పులు జరిగాయి.

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎస్‌వోజీ, డీవీఎఫ్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇందులో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని తెలిపారు. ‘‘రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను కొండలపై నుంచి దించిన తర్వాతే వివరాలు చెప్పగలం’’ అని చెప్పారు. 

ఇక, మావోయిస్టుల శిబిరం నుంచి కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరణించిన ఇద్దరూ మహిళా మావోయిస్టులు కూడా ఏరియా కమిటీ మెంబర్ హోదాలో ఉన్నారని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. 

click me!