టాటూలు వేయించుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్.. రిజల్ట్‌తో షాక్.. అసలేం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Aug 7, 2022, 2:58 PM IST
Highlights

శరీరంపై టాటూలు వేయించుకోవడం వారి కొంప ముంచింది. టాటూ వేయించుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. టాటూ వేసే వ్యక్తులు ఒకే సూదిని అనేక మందికి వినియోగించడమే ఇందుకు కారణంగా తేలింది. 

శరీరంపై టాటూలు వేయించుకోవడం వారి కొంప ముంచింది. టాటూ వేయించుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. టాటూ వేసే వ్యక్తులు ఒకే సూదిని అనేక మందికి వినియోగించడమే ఇందుకు కారణంగా తేలింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగుచూసింది. వారణాసి జిల్లా ఆసుపత్రి వైద్యుల ప్రకారం.. గత రెండు నెలల్లో తమ శరీరాలపై టాటూలు వేయించుకున్న తర్వాత కనీసం ఇద్దరు రోగులకు హెచ్‌ఐవి పాజిటివ్ తేలింది. వివరాలు.. జిల్లాలోని బరాగావ్ ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల వ్యక్తి గ్రామంలో జరిగిన జాతరలో తన చేతికి టాటూ వేయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. అతనికి తీవ్ర జ్వరం వచ్చి బలహీనుడయ్యాడు. అన్ని రకాల చికిత్సలు చేసినా అతని ఆరోగ్యం కుదుటపడలేదు.

దీంతో డాక్టర్లు అతని హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. అందులో అతడి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే ఆ రిపోర్ట్‌ను అతడు నమ్మలేదు. అందులో తప్పు దొర్లిందని భావించాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఎవరితోనూ శారీరక సంబంధం లేదని, రక్తం ఎక్కించుకోలేదని డాక్టర్లకి చెప్పాడు. తర్వాత డాక్టర్లు అతని టాటూ గురించి తెలుసుకుని.. హెచ్‌ఐవీ సోకడానికి అదే కారణమని అతనికి వివరించారు.

 మరోవైపు నాగవాన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆమె ఒక హాకర్ ద్వారా టాటూ వేయించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమించడం ప్రారంభించింది. రోగనిర్ధారణ పరీక్ష తర్వాత ఆమె హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది.

దీంతో అధికారులు టాటూలు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేస్తున్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రీతి అగర్వాల్ మాట్లాడుతూ..  ‘‘జాగ్రత్తగా పరిశీలించి, కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత, చాలా మంది హెచ్‌ఐవీ రోగులు టాటూలు వేయించుకున్నారని, వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని తెలిసింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులందరూ ఒకే సూదిని ఉపయోగించిన ఒకే వ్యక్తి నుంచి టాటూలు వేయించుకున్నారు. టాటూ సూదులు చాలా ఖరీదైనవి కాబట్టి టాటూ ఆర్టిస్టులు డబ్బును ఆదా చేయడానికి తరచుగా వినియోగించిన సూదులనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారు. తక్కువ ధరకే టాటూ వేస్తామంటే నమ్మొద్దు. టాటూ వేయించుకునే ముందు సూది కొత్తగా ఉందో లేదో చూసుకోవాలి’’ అని సూచించారు.

click me!