
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ, ఓ పురుషుడు నిప్పంటించుకోవడం కలకలం రేపింది. సుప్రీంకోర్టు గేట్ నెంబర్ డీ ఎదుట సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై నిప్పు ఆర్పారు. బాధితులను రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వారు నిప్పంటించుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వివరించాలరు.
బాధితులిద్దరు తొలుత సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని ఐడీ కార్డులు అడగ్గా వారు సమర్పించలేకపోయారు. దీంతో ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆ గేటు బయటే నిప్పు అంటించుకున్నారు. వెంటనే పోలీసులు బ్లాంకెట్లు, ఇతర వస్త్రాలతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేశారు. అక్కడే నిలబడి ఉన్న కొందరు యువకులూ నిప్పు ఆర్పడంలో సహకరించారు. అనంతరం వారిని పోలీసు వ్యాన్‌లో హాస్పిటల్‌కు తరలించారు.