మేఘాలయాలో హింసాత్మక ఆందోళనలు.. హోం మంత్రి రాజీనామా

By telugu teamFirst Published Aug 16, 2021, 3:21 PM IST
Highlights

మాజీ తిరుగుబాటు నేతను పోలీసుల చంపిన తర్వాత మేఘాయలలో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసుల నుంచీ ఆయుధాలను లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత దిగజారే ముప్పు ఉన్నదని పేర్కొంటూ హోం మంత్రి రాజీనామా చేశారు.

షిల్లాంగ్: మాజీ తిరుగుబాటు నేతను చంపడంతో మేఘాలయాలో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ఆందోళనకారులు పోలీసుల వాహనాన్ని చూట్టుముట్టి వారి నుంచి ఆయుధాలు లాక్కుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆదివారం సీఎం కన్రాడ్ సంగ్మా నివాసంపై పెట్రో బాంబులు విసిరారు. అయితే, ఆయన తన అధికారిక నివాసంలో ఉంటుండంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత దిగజారే ముప్పు ఉన్నదని, మాజీ తిరుగుబాటు నేత చెరిష్ స్టార్ఫీల్డ్ థాంగ్ కీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని పేర్కొంటూ హోం మంత్రి లక్మెన్ రింబూ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కన్రాడ్ సంగ్మాకు అందజేశారు.

మాజీ తిరుగుబాటు నేత ఇంటిలో పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. అనంతరం కాల్పులు జరిగాయి. ఇందులో చెరిష్ స్టార్ఫీల్డ్ థాంగ్ కీ ప్రాణాలుకోల్పోయారు. దీనిపై శనివారం సాయంత్రం నుంచే రాజధాని షిల్లాంగ్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలపైనా దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆదివారం కర్ఫ్యూ విధించింది. 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.

‘పోలీసుల తనిఖీల తర్వాత చెరిష్ స్టార్ఫీల్డ్ థాంగ్ కీ హత్య కావడంపై షాక్‌కు గురయ్యాను. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర పరిస్థితుల దృష్ట్యా దయచేసి నాకు అప్పగించి హోం శాఖ పోర్ట్‌ఫోలియో నుంచి నన్ను రిలీవ్ చేయాల్సిందిగా కోరుతున్నా’ అంటూ తన రాజీనామా లేఖలో లక్మెన్ రింబూ పేర్కొన్నారు.

click me!