ఏసీ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాతశిశువులు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. ఓ డాక్టర్ రాత్రంతా ఏసీ వేసుకుని పడుకోవడంతో ఈ దారుణం జరిగింది.
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని శామలీ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ డాక్టర్ నిర్లక్ష్యంతో ఇద్దరు నవజాత శిశువులు కన్ను తెరవకముందే మృత్యువాత పడ్డారు. వివరాలలోకి వెళితే.. అలసిపోయి హాయిగా నిద్రపోవాలనుకున్న ఓ డాక్టర్ ఏసీ వేసుకుని పడుకున్నాడు. అయితే, ఆ చలికి అప్పుడే పుట్టిన నవజాత శిశువులు తట్టుకోలేకపోయారు. దీంతో వారిద్దరూ మరణించారు. ఈ దారుణానికి కారణమైన నీతూ అనే డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం నాడు ఉత్తరప్రదేశ్లోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు జన్మించారు. అయితే, వారికి పుట్టిన తర్వాత మెరుగైన చికిత్స అవసరం పడడంతో దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్ కి తరలించారు. ఆ శిశువులిద్దరికీ అక్కడి ఫోటో థెరపీ యూనిట్లో చికిత్స ఇస్తున్నారు.
ఈ యూనిట్లో ఉన్న డాక్టర్ నీతు చిన్నారులను పట్టించుకోకుండా నిద్రపోవడానికి రాత్రంతా ఏసి వేసుకున్నారు. ఉదయం చిన్నారుల కోసం ఆస్పత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులకి చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే, దీనికి కారణమైన నీతు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.