Encounter in Kulgam: అమర్‌నాథ్ యాత్రకు ముందు రోజు.. కుల్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు LeT ఉగ్రవాదుల హతం

By Rajesh KFirst Published Jun 29, 2022, 10:51 PM IST
Highlights

Encounter in Kulgam: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధ‌వారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని మీర్ బజార్ ప్రాంతంలోని  ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం రావ‌డంతో భద్రతా బలగాలు..  కార్డన్ అండ్ సెర్చ్ నిర్వ‌హించారు. ఆ సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. 

Encounter in Kulgam: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు రోజు జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బుధ‌వారం ఎన్‌కౌంటర్ జరిగింది. నౌపోరా మీర్ బజార్ ప్రాంతంలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కి చెందినవారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. బుధ‌వారం ఉద‌యం.. కుల్గామ్‌లోని మీర్ బజార్ ప్రాంతంలోని నవాపోరాలో ఉగ్రవాదులు ఉన్నారని విశ్వ‌స‌నీయ సమాచారం భద్రతా బలగాల‌కు అందింది. దీంతో అప్ర‌మ‌త్తమైన భ‌ద్ర‌త బ‌ల‌గాలు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వ‌హించారు. సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారి తెలిపారు.

ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దరూ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ LeTకి చెందిన  ఉగ్రవాదులుగా గుర్తించబడ్డారు. అమ‌ర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న‌ నేప‌థ్యంలో ఈ ముఖ్యమైన ఎన్‌కౌంటర్ జ‌రిగింద‌ని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. మీర్ బజార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌నే నిఘా వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం .. జ‌మ్మూ పోలీసులు, సైన్యం సంయుక్తంగా కార్డన్ అండ్  సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారనీ, బలగాలు అనుమానాస్పద ప్రదేశానికి చేరుకోవడంతో.. దాక్కున్న ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు.వారి దాడిని ఎదుర్కొవడానికి ఎదురుదాడి చేసిన‌ట్టు తెలిపారు. శ్రీ అమర్‌నాథ్ యాత్ర 2022  కోసం మొదటి బ్యాచ్ ప్రారంభ‌మైంది. ఎన్‌కౌంటర్ స్పాట్ కు, ఆ యాత్ర‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం .

ఈ ఏడాది ప్రారంభం నుంచి కాశ్మీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 73వ ఎన్‌కౌంటర్ జ‌రిగాయి. భద్రతా బలగాలు 123 మంది ఉగ్రవాదులను హతమార్చగా, వారిలో 33 మంది పాకిస్థానీలే. 16 మంది భద్రతా సిబ్బంది, 19 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కాశ్మీర్‌లో 46 మంది యాక్టివ్ టెర్రరిస్టులను, 192 మంది టెర్రరిస్టు మద్దతుదారులు కూడా అరెస్టయ్యారు. 

click me!