
Two Lashkar-e-Taiba terrorists arrested in Baramulla: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. వివరాల్లోకెళ్తే.. లష్కరే తోయిబా (టీఆర్ ఎఫ్)కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా కుంజర్ వద్ద అరెస్టు చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. రెండు ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, 15 ఏకే 47 రౌండ్లు, నిషేధిత లష్కరే తోయిబా (టీఆర్ ఎఫ్) 20 బ్లాంక్ పోస్టర్లు సహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బారాముల్లా పోలీసులు, 176 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కుంజర్ లోని మోంచ్ ఖుద్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో జంద్ పాల్ కుంజర్ కు చెందిన ఖుర్షీద్ అహ్మద్ ఖాన్, రియాజ్ అహ్మద్ ఖాన్ అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (టీఆర్ ఎఫ్ )లో ఉగ్రవాద సహచరులుగా పనిచేస్తున్నట్లు విచారణలో ఇద్దరు నిందితులు వెల్లడించారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కుంజర్, పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉగ్రవాద సహచరులు ఈ అక్రమ మందుగుండు సామగ్రిని పొందారని పోలీసులు వెల్లడించారు. కుంజర్ పోలీస్ స్టేషన్ లో ఆర్మ్స్ అండ్ యూఏ (పీ) యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుండగా, శ్రీనగర్ లో యూరి, రాంపూర్ సెక్టార్లలో ఉగ్రవాద సంబంధిత సంఘటనలను అరికట్టడానికి హోలీ పండుగ వేడుకల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్త భద్రతా సమావేశాలు నిర్వహించాయి. హోలీ పండుగకు ముందు కాశ్మీర్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు తమకు పలు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. బండి, లగామ, మాచిక్రాండ్ గ్రామాల్లో పగలు, రాత్రి గస్తీ నిర్వహించి అక్కడి మైనార్టీ వర్గాల పెద్దలను కలుసుకుని వారి భద్రతకు భరోసా కల్పించారు.