
తిరువనంతపురం: కేరళ ఉత్తర జిల్లా కాసర్‌గోడ్‌కు చెందిన 50 ఏళ్ల మొహమ్మద్ బవా అప్పుల్లో నిండా మునిగిపోయాడు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పుతోపాటు తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చడానికి పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. ఇరుగు పొరుగు, బంధువులు, ఆప్తులు అందరి నుంచి ఆయన అప్పులు చేసి కూర్చున్నాడు. బ్యాంకులనూ వదల్లేదు. లోన్లు తీసుకున్నాడు. ఇవన్నీ పీకల మీదకు వచ్చాయి. మొత్తం అప్పులు సుమారు రూ. 50 లక్షలకు చేరింది. దీంతో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇల్లు అమ్మేయక తప్పని పరిస్థితికి వెళ్లాడు.
కానీ, అప్పుడే అదృష్టం ఆయనను వరించింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అపనమ్మకంతో కొనుగోలు చేసిన లాటరీ ఆయన ఇంటిని కాపాడింది. ఆయన కుటుంబాన్నే నిలబెట్టింది. ఏకంగా రూ. 1 కోటి లాటరీ తగిలింది. ఈ జాక్‌పాట్ ఒక్కసారిగా తలకిందులుగా ఉన్న తన ఆర్థిక స్థితిని నిటారుగా నిలబెట్టింది. ఈ డబ్బుతో తన అప్పులు తీర్చడమే కాదు.. మిగిలిన డబ్బులను పేదలు, అన్నార్తులకు ఖర్చు పెడతానని చెప్పాడు.
కాసర్‌గోడ్ జిల్లా మంజేశ్వర్‌కు చెందిన మొహమ్మద్ బవా అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పును చెల్లించడానికి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొనుగోలుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడానికి పార్టీ రానుంది. కానీ, ఐదుగురు పిల్లల తండ్రి అయిన మొహమ్మద్ బవాకు ఆదివారం 3.30 గంటలకే విడుదలైన లాటరీ ప్రకటన ఊపిరి పోసింది. అదృష్టవశాత్తు నా ఇల్లు అమ్మకానికి అడ్వాన్స్ తీసుకోవడానికి రెండు గంటల ముందే తాను లాటరీ గెలిచానని మొహమ్మద్ బవా ఆనందంతో తెలిపాడు.
ఇల్లు కొనుగోలుకు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన వారు.. మా ఇంట్లో ఇతరులు అందరితో కలిసి జరుగుతున్న సందడి చూసి ఖంగుతిన్నారు. ఆ తర్వాత లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు కూడా సంతోషపడ్డారు.
తాను రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు కొనేవాడిని కాదని, కానీ, ఆ లాటరీ అమ్మే వ్యక్తి తనకు తెలుసు అని మొహమ్మద్ బవా వివరించాడు. ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు కొన్ని లాటరీ టికెట్లు ఇచ్చి వెళ్లేవాడని తెలిపాడు. అప్పులతో సతమతం అవుతున్న తాను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ లాటరీ కొనుగోలు చేశానని వివరించాడు.
టాక్స్ కటింగ్ పోను.. మొహమ్మద్ బవా రూ. 63 లక్షలు పొందనున్నాడు.