
ఇటీవలి కాలంలో ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు కలిసి సహజీవనం చేయడం, పెళ్లిళ్లు చేసుకోవడం వంటి ఘటనల గురించి తరచుగా వింటున్నాం. అలాంటిదే ఈ కథ కూడా. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు జండర్ మార్చుకుని చివరికి అవమానాల పాలైంది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం (tamilnadu) మధురై (madhurai) విల్లాపురం మీనాక్షి నగరానికి చెందిన సెల్వం కుమార్తె జయసుధ . ఆమెకు సింథిలా అనే స్నేహితురాలు ఉంది. వీరిద్దరూ స్నేహితులమన్న పరిధి దాటి ప్రేమ పక్షులుగా మారిపోయారు. ఒకరిని విడిచి ఒకరు వుండలేని స్థాయికి వ్యవహారం చేరుకుంది. అంతేకాదు.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని సింథిలా, జయసుధలు నిర్ణయించుకున్నారు.
అయితే తమ పెళ్లిని సమాజం ఒప్పుకోదని తెలిసి ఇద్దరిలో ఒకరు లింగ మార్పిడి (gender change operation) చేయించుకోవాలని ఫిక్సయ్యారు. దాంతో మధురై ఆస్పత్రిలో జయసుధ సెక్స్ మార్పిడి చేయించుకుని మగవాడిగా మారి ఆది శివన్‌గా పేరు మార్చుకుంది. అనంతరం ఆది శివన్, సెంథిలా ఇంటి నుంచి పారిపోయి తిరుపురం కొండల్లో కాపురం పెట్టారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో సెంథిలా తల్లిదండ్రులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో రెండు నెలల తర్వాత సెంథిలా తన తల్లికి ఫోన్ చేసి ఆచూకీ చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి కూతురిని ఇంటికి తీసుకొచ్చేశారు. అంతేకాదు మరో అబ్బాయితో పెళ్లి చేసి పంపారు. దీనిపై ఆదిశివన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు.. తనకు ఆదిశివన్తో ఉండటం ఇష్టం లేదని, అందుకే వచ్చేశానని ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని పోలీసులకు చెప్పింది సెంథిలా. దీంతో ఇప్పుడు జయసుధ అలియాస్ ఆది శివన్ అనాథ అయ్యింది. విషయం తెలిసి ఎవరూ ఆమెకు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడంలేదు. ప్రస్తుతం వీరి వ్యవహారం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.