Coronavirus: ఈ ఏడాది జనవరి నుంచి మార్చివరకు దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన కోవిడ్-19 మరణాల్లో 97 శాతం నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్టు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. కోవిడ్-19 మరణించిన వారి నుంచి సేకరించిన 578 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ లో 560 ఒమిక్రాన్ వేరియంట్‌ను కలిగి ఉన్నట్లు తేలింది.
Delhi Omicron Cases: కరోనా వైరస్ కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం.. అవి ఇప్పటివరకు వెలుగుచూసిన వాటి కంటే అధిక వ్యాప్తి అంచనాలు కలకలం రేపుతున్నాయి. ఇక భారత్ లోనూ కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 కొత్త కేసులు పెరుగుతుండటంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మాస్కులు తప్పని సరిచేస్తూ.. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వాలకు వైరస్ వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితుల గురించి హెచ్చరిస్తూ.. చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు కోవిడ్-19 తో చనిపోయిన వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం.. జనవరి నుండి మార్చి వరకు ఢిల్లీలో కోవిడ్‌తో మరణించిన వారి నుండి తీసిన తొంభై ఏడు శాతం నమూనాలలో కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్ ఉందని గుర్తించారు. కోవిడ్-19 తో మరణించిన వారి నుండి సేకరించిన 578 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా వాటిలో 560 ఒమిక్రాన్ వేరియంట్‌ను కలిగి ఉన్నట్లు తేలింది. మిగిలిన 18 (మూడు శాతం)లో డెల్టాతో సహా COVID-19 ఇతర వైవిధ్యాలు ఉన్నాయి. ఇది గత సంవత్సరం ఏప్రిల్ మరియు మేలలో కొత్త వేరియంట్లు కొత్త వేవ్ కు కారణమైన సంగతి తెలిసిందే.
undefined
మొత్తంమీద, మార్చిలో రాజధానిలోని జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలలో విశ్లేషించబడిన మొత్తం 504 నమూనాలలో ఓమిక్రాన్ వేరియంట్ కనుగొనబడింది. Omicron వేరియంట్ కారణంగా కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చింది. అయితే, రికార్డు స్థాయిలో కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంది. కానీ దీర్ఘకాలికంగా ఈ వేరియంట్ ప్రభావం చూపుతున్నదని పరిశోధనల్లో ఇదివరకే వెల్లడైంది. అధిక మరణాలకు కారణం కాదని కూడా ప్రభుత్వ డేటా పేర్కొంది. కానీ ప్రస్తుతం చనిపోయిన వారిలో 97 శాతం ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్పత్రుల్లోని 15,505 కోవిడ్-19 పడకల్లో గరిష్టంగా 2,784 (17.96 శాతం) జనవరి 17న నిండిపోయాయి. సెకండ్ వేవ్ సమయంలో, మే 6 న 21,839 పడకలలో 20,117 (92 శాతం) నిండిపోయాయి.
ఢిల్లీ మరోసారి కరోనా కొత్త కేసుల పెరుగుదలను చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్కులు తప్పకుండా ధరించాలనీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సమావేశం కాకుండా ఉంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఉల్లంఘించిన వారికి ₹ 500 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేసింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తన సమావేశంలో పాఠశాలలను మూసివేయకూడదని నిర్ణయించిందని, అయితే నిపుణులతో సంప్రదించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా XE వేరియంట్ వంటి కొత్త వేరియంట్ నగరంలో వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి ఢిల్లీ రాజధానిలోని కోవిడ్ సోకిన వ్యక్తులందరి నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.