Karnataka: బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ నెట్టారు హత్యకేసులో బెల్లారే నివాసితులైన ఇద్దరిని అరెస్టు చేయగా, ఫాజిల్‌పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
2 Murders In Karnataka: కర్ణాటకలోని దక్షిణ కన్నడలో గత రెండు రోజుల్లో రెండు హత్యలు చోటుచేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు పెద్దఎత్తున జనాలు గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో సెక్షన్ 144ను కూడా విధించారు. ప్రభుత్వంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతుండగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
కర్నాటకలో లో రెండు వరుస హత్యలకు సంబంధించిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి..
గురువారం సాయంత్రం కర్నాటకలోని మంగళూరులో ఒక దుకాణం వెలుపల ముసుగులు ధరించిన దుండగులు 23 ఏళ్ల ఫాజిల్‌ను కత్తితో పొడిచి చంపారు .
ఈ క్రూరమైన దాడికి సంబంధించిన దృశ్యాలు లేన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముఖానికి నల్లటి గుడ్డ కప్పుకున్న దుండగులు.. ఫాజిల్‌ను కర్రతో కొట్టి, కత్తులతో పొడిచారు.
అప్పటికే బాధితుడు కుప్పకూలిపోయి, అతనిపై ఒక బొమ్మ పడిన తర్వాత కూడా, ఒక వ్యక్తి అతన్ని కొట్టడం ఆపలేదు.
అంతకుముందు బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టారును నరికి చంపిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది. ఈ హత్య బెల్లారే, సుల్లియాలో నిరసనలకు దారితీసింది. విశ్వహిందూ పరిషత్ బంద్‌కు పిలుపునిచ్చింది.
శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకెళ్లినప్పుడు వందలాది మంది కలిసి నడిచారు. నెట్టారు హత్య వెనుక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందని కొన్ని మితవాద సంస్థలు ఆరోపించాయి.
ఫాజిల్‌పై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుండగా, నెట్టారు హత్యకు సంబంధించి బెల్లారే నివాసితులైన ఇద్దరిని అరెస్టు చేశారు.
శుక్రవారం నాడు జరిగిన ఫాజిల్ అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్నారు.
కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని 55 చోట్ల శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
మంగళూరులో జూలై 30 ఉదయం వరకు నిషేధాజ్ఞలు విధించారు.
దీంతో అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. కర్ణాటక-కేరళ సరిహద్దుతో సహా 19 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ అన్ని వాహనాలను సోదా చేస్తారు.
రాత్రి 10 గంటల తర్వాత నగరంలో ఎవరినీ తిరగనివ్వబోమని మంగళూరులో పోలీస్ చీఫ్ శశికుమార్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం బొమ్మై రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు 'ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని' తెలియజేస్తోందని అన్నారు.