పబ్జీ ఆడుతూ.. ట్రాక్‌పై వాకింగ్.. వారిపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ఇద్దరు బాలురు దుర్మరణం

By telugu teamFirst Published Nov 21, 2021, 2:04 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పదో తరగతి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతూ రైల్వే ట్రాక్‌పై మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లారు. గేమ్‌లో మునిగిపోయిన ఈ ఇద్దరు పిల్లలను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టుకుని వెళ్లిపోయింది. ఈ ట్రైన్ కింద పడిపోయిన ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు మృతదేహాలు చూసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ ధ్వంసమైనా.. మరో ఫోన్‌లో పబ్జీ గేమ్ నడుస్తూనే ఉన్నది. పోలీసులకు విషయం చేరవేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
 

లక్నో: పబ్జీ(PUBG) ఆట ఆ ఇద్దరు మైనర్ పిల్లల ప్రాణాలు తీసింది. చుట్టూ పరిసరాలను పట్టించుకోకుండా ట్రాక్‌పై పబ్జీ ఆడుతూ వెళ్లుతున్న ఇద్దరు బాలుర(Boys)ను గూడ్సు ట్రైన్(Train) కబళించింది. వారిద్దరి పై నుంచి ఆ గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో వారిద్దరూ ట్రాక్‌పై విగత జీవులయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఫోన్‌లో ఇంకా పబ్జీ రన్ అవుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటన Uttar Pradeshలోని మాథుర - కాస్‌గంజ్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ రోజు చోటుచేసుకుంది.

మాథురలోని లక్ష్మీనగర్ ఏరియాకు చెందిన వీరిద్దరు పదో తరగతి చదువుతున్నారు. మార్నింగ్ వాక్ కోసం బయల్దేరారు. అయితే, వారు రైల్వే ట్రాక్‌పై వాకింగ్ చేశారు. అప్పుడు ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ వాకింగ్ చేయడంతో చుట్టూ పరిసరాలను వారు మరిచిపోయారు. తాము నడుస్తున్నది ట్రాక్‌పై అని, ఓ గూడ్స్ రైలు అదే ట్రాక్‌పై వస్తున్నట్టూ వారికి తెలియకుండా పోయింది. ఆ గూడ్స్ ట్రైన్ వారి మీద నుంచే వెళ్లిపోయింది. దీంతో ఆ పిల్లలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ లు మృతి.. ఆడికారులో వెంటాడి మరీ...దారుణం..డ్రగ్ పెడ్లర్ల పనేనా?

ఆ మృతదేహాల వివరాలను జమునాపూర్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ శశి ప్రకాశ్ సింగ్ వెల్లడించారు. వారిపై నుంచి ఏ ట్రైన్ దూసుకెళ్లిందో కచ్చితంగా తాము గుర్తించలేకపోయామని వివరించారు. ఆ పిల్లలిద్దరూ పదో తరగతి చదువుతున్నారని చెప్పారు. మృతి చెందిన వారిని గౌరవ్ కుమార్(14), కపిల్ కుమార్(14)లుగా ధ్రువీకరించారు. గౌరవ్ కుమార్ గురునానక్ దేవ్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి, కపిల్ కుమార్ బీజీబీ బ్రాజ్ ఎడ్యుకేషన్ అకాడమీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులని తెలిపారు. ఈ పిల్లలు ఇరుగు పొరుగు ఇండ్లల్లో ఉండేవారని పేర్కొన్నారు.

మృతుడు గౌరవ్ కుమార్ తండ్రి రాహుల్ కుమార్ ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన డైరీ బిజినెస్ నడుపుతున్నాడు. తన కుమారుడు రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడని చెప్పాడు. ఈ రోజే తన కుమారుడు తొలిసారి వాకింగ్ కోసం బయటికి వెళ్లాడని తెలిపాడు. ఇక నుంచీ రోజూ వాకింగ్‌కు వెళ్లాల్సిందిగా తాను సూచించినట్టూ వివరించాడు. కానీ, ఇప్పుడు తమ కుమారుడే శాశ్వతంగా తమ నుంచి వెళ్లి పోయాడని బాధపడ్డాడు. 

Also Read: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ దుర్మరణం

గౌరవ్ కుమార్ తన తండ్రి మొబైల్ ఫోన్ తీసుకుని వాకింగ్‌కు వెళ్లాడు. వంద మీటర్ల దూరంలో ఉండే తన మిత్రుడు కపిల్ కూడా గౌరవ్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఈ ఘటనపై కపిల్ తండ్రి స్పందిస్తూ.. తనకు ఆ ఆన్‌లైన్ గేమ్ గురించి తెలియదని అన్నాడు. తెలిసి ఉంటే తన మొబైల్ ఫోన్‌కు కొడుకు కపిల్‌కు అస్సలు ఇచ్చేవాడు కాదని కపిల్ తండ్రి సంజయ్ కుమార్ వివరించాడు. సంజయ్ కుమార్ ఓ వ్యాపారి.

ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్(పబ్జీ) ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్. ఇది యువతలో చాలా ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ గేమ్. ఈ గేమ్ యువతను వెంటనే ఆకర్షించే తరహాలో ఉంటుందని, సులువుగా బానిసగా మార్చేంత ఆకర్షణ గేమ్‌లో ఉన్నదని నిపుణులు చెప్పారు. ఈ గేమ్ ఆడేవారిలో కొందరిలో హింసా ప్రవృత్తి కూడా పెరిగే ముప్పు ఉన్నదని వివరించారు.

click me!