ఢిల్లీకి మమతా బెనర్జీ.. పార్లమెంటు సమావేశాలపై విపక్షాలతో కార్యచరణకు వ్యూహం!.. ప్రధానితోనూ భేటీ

By telugu teamFirst Published Nov 21, 2021, 1:23 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆమె ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. వచ్చే శీతాకాల సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరించే వ్యూహంపై చర్చలు జరిపే అవకాశముంది. అలాగే, ఇదే పర్యటనలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో తమ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ పరిధి పెంపుపైనా ఆమె మాట్లాడనున్నట్టు తెలిసింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు. ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి Mamata Banerjee ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు Delhi పర్యటించనున్నారు. ఈ ఏడాది Parliament శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరనున్నాయి. ముఖ్యంగా మూడు సాగు చట్టాల(Farm Laws) రద్దు అంశం ప్రధానంగా ముందుకు రానుంది. అయితే, ఈ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు(Opposition) అనుసరించాల్సిన వ్యూహం(Strategy)పై ఇంకా చర్చలు జరుగలేదు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆమె ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ శీతాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరపనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఇదే పర్యటనలో ప్రధాన మంత్రి Narendra Modiతోనూ సమావేశం కాబోతున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలపై 15 నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ శీతాకాల సమావేశాల్లోనూ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే శీతాకాల సమావేశాలపై ఆసక్తి నెలకొంది. గత పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దు, పెగాసెస్ వంటి అంశాలను ప్రధానంగా పేర్కొంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమావేశాలూ అర్ధంతరంగానే ముగిశాయి. అయితే, వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల తీరు ఎలా ఉండబోతున్నదనేది ఇంకా స్పష్టం కాలేదు. 

Also Read: Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?

సాగు చట్టాల రద్దు తర్వాత రైతు సంఘాలు నిరనన విరమించుకోలేదు. సాగు చట్టాల తర్వాత తమ ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కావాలని ఉన్నదని గుర్తు చేశారు. ఆ డిమాండ్ కూడా పరిష్కరించిన తర్వాతే తాము ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లోనూ ప్రతిపక్ష పార్టీలు కనీస మద్దతు ధరపై పోరాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ఒంటి చేత్తో గెలిపించిన తర్వాత మమతా బెనర్జీ ఢిల్లీకి తొలిసారిగా పర్యటన చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఎంసీ త్రిపుర, గోవాల్లోనూ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలకు టీఎంసీని విస్తరించే దేశవ్యాప్తంగా ఉనికిని తెలియజేసే యోచనలో తృణమూల్ కాంగ్రెస పార్టీ ఉన్నది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మమతా బెనర్జీని వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఎదుర్కొనే ప్రత్యర్థ అభ్యర్థిగానూ పలువురు చిత్రించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఉన్నదనే వాదనలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలు జరపనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: 700 మంది చనిపోయారు, రైతులకు సారీ చెబితే చాలా.... రేపు ఢిల్లీలో తాడోపేడో : కేసీఆర్

అసోం, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లలో బీఎస్ఎఫ్ పరిధిని పెంచడంపై పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశ సమాఖ్యస్ఫూర్తికి భంగం కలిగిస్తూ రాష్ట్రాల హక్కులను హరించే యత్నం చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఈ చర్యను నిరసిస్తూ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు. ఆమె చేస్తున్న ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనూ బీఎస్ఎఫ్ పరిధి పెంపుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

click me!