ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం .. జూన్ 7న భూమిపూజ, ఏక్‌నాథ్ షిండే‌కు టీటీడీ ఆహ్వానం

By Siva KodatiFirst Published May 30, 2023, 7:45 PM IST
Highlights

టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు. ముంబైలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమం వచ్చే 7న జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎంను సుబ్బారెడ్డి ఆహ్వానించారు. 

ముంబైలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ వచ్చే నెల 7వ తేదీన భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఆహ్వానించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడి. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం నవీ ముంబైలోని ఉల్వే నోడ్ సెక్టార్ 12లోని పది ఎకరాల భూమిని ఏప్రిల్ 2022లో టీటీడీకి కేటాయించింది అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం. ఉల్వే సమీపంలో శ్రీవారి ఆలయం నిర్మితమవుతున్న ప్రాంతం.. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వుంది. ఈ భూమి విలువ రూ.500 కోట్ల పైనే వుంటుందని అంచనా. దాతల సహకారంతో టీటీడీ ఇక్కడ ఆలయాన్ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.70 కోట్లు ఖర్చవుతాయని అంచనా. 

ఇకపోతే.. జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బాలాజీ మందిరాన్ని నిర్మించింది. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన ఆలయాన్ని యాత్రికుల సందర్శనార్థం జూన్ 8వ తేదీన తెరవనున్నారు. హిందూ సనాతన ధర్మ వ్యాప్తి, వేంకటేశ్వరుని మహిమను  పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలనే నినాదంలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల సంస్థ అయిన టీటీడీ భారతదేశంలోని ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక వెంకటేశ్వరుడి ప్రతిరూప ఆలయాన్ని నిర్మించే బాధ్యతను తనపై మోపింది. అందులో భాగంగానే జమ్మూ లో ఆలయాన్ని నిర్మించింది.

ALso Read: తిరుమల ఘాట్ రోడ్డు: 12 ఏళ్లు దాటిన వాహనాలకు నో ఎంట్రీ

తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న టీటీడీ ఇప్పటి వరకు అమరావతి, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, భువనేశ్వర్, ముంబై, న్యూఢిల్లీలలో వేంకటేశ్వర ఆలయాలను నిర్మించింది. జమ్మూలో త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనున్నారు. 

click me!