
African Swine Flu: భారత్ లో ఆఫ్రికన్ సైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఈశాన్య భారతంలో ఈ వైరస్ ను గుర్తించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. మొదట ఈశాన్య భారత రాష్ట్రమైన మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించారు. ఇప్పుడు త్రిపుర రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. త్రిపురలోని జంతు వనరుల అభివృద్ధి విభాగం (ARDD) ఆధ్వర్యంలోని సెపాహిజాలా జిల్లా పరిధిలోని దేవిపూర్‌లో ఉన్న ప్రభుత్వ పెంపకం ఫారం ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారం.. 63కి పైగా పందులు తెలియని కారణాల వల్ల చనిపోయాయి. ఆఫ్రికన్ సైన్ ఫ్లూ భయాందోళనలు మరింతగా పెరిగాయి. ఒక నిపుణుల బృందం సదరు ఫామ్ ను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను కూడా ఏర్పాటు చేసింది. ఫామ్ లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో... అది ఫామ్ మొత్తం వ్యాపించి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
పశుసంవర్ధక శాఖ రన్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ లాబొరేటరీ ప్రకారం.. ఏప్రిల్ 7 న పరీక్ష కోసం మూడు నమూనాలను ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీకి పంపారు. ఏప్రిల్ 13 న లాబొరేటరీకి అన్ని నమూనాలు ఆఫ్రికన్ సైన్ ఫ్లూ సోకినట్టు ఫలితాలు వచ్చాయి. “ఇప్పుడు అక్కడ ఆశ్రయం పొందిన పందుల లక్షణాలు కూడా అంటు వ్యాధి ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రవేశించినట్లు సూచిస్తున్నాయి. భోపాల్‌లోని నేషనల్ డిసీజ్ డయాగ్నస్టిక్ ఇన్‌స్టిట్యూట్ నుండి రావాల్సిన మరో నివేదిక ఇంకా త్రిపురకు చేరుకోలేదు” అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేసులను గుర్తించిన తర్వాత వివిధ దశల్లో పందులను సామూహికంగా చంపేయాలని త్రిపుర ఆదేశించింది. మొదటి దశలో ఆఫ్రికన్ సైన్ ఫ్లూ సోకిన పందులను పూడ్చడానికి 8 అడుగుల లోతు, వెడల్పుతో సమాధులు తవ్వినట్లు సమాచారం.
ఆఫ్రికన్ సైన్ ఫ్లూ పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యవసాయ కార్మికులు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించినట్టు తెలిసింది. ARDD వ్యాధి పరిశోధన ప్రయోగశాల ప్రకారం.. పరిస్థితిని ఎదుర్కోవటానికి పది మంది చొప్పున రెండు టాస్క్‌ఫోర్స్‌లు టీంలను ఏర్పాటు చేశారు. రెండు బృందాలకు వెటర్నరీ అధికారి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ సైన్ ఫ్లూ కేసులను గుర్తించడం.. ప్రస్తుతం పరిస్థితుల గురించి ప్రయోగశాల అధికారులు కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తూ లేఖ రాయనున్నట్టు సమాచారం. మొదట ఇక్కడ ఉన్న265 పందులు, 185 పంది పిల్లల్లో 63 పందులు గుర్తు తెలియని కారణాలతో చనిపోవడంతో... వాటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వాటికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ సోకినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా, మిజోరంలో రెండు నెలల వ్యవధిలో 700 పైగా పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐజ్వాల్, చంపై, లుంగ్లీ మరియు సైచువల్ జిల్లాల్లోని కనీసం 17 గ్రామాలు ఆఫ్రికన్ సైన్ ఫ్లూ వ్యాప్తి కారణంగా ప్రభావితమయ్యాయి.