తృణమూల్ ఎంపీ సుష్మితా దేవ్ కారుపై దాడి.. ఆ ప్రకటన చేసిన మరుసటి రోజే.. బీజేపీ కార్యకర్తల పనేనన్న టీఎంసీ

By team teluguFirst Published Oct 22, 2021, 4:51 PM IST
Highlights

తృణమూల్  కాంగ్రెస్ ఎంపీ  సుష్మితా  దేవ్ (Sushmita Dev)  కారుపై కొందరు వ్యక్తులు  దాడి చేశారు.  ఈ ఘటనలో తృణమూల్  కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్‌కు  కొందరు ఉద్యోగులు గాయపడ్డారు.

తృణమూల్  కాంగ్రెస్ ఎంపీ  సుష్మితా  దేవ్ (Sushmita Dev)  కారుపై కొందరు వ్యక్తులు  దాడి చేశారు.  ఈ ఘటనలో తృణమూల్  కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్‌కు (I-PAC)  చెందిన కొందరు ఉద్యోగులు గాయపడ్డారు. త్రిపురలో తృణమూల్‌కు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న  సమయంలో ఈ దాడి జరిగింది. అయితే దాడులకు పాల్పడింది  బీజేపీ కార్యకర్తలేనని తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఆరోపిస్తుంది. పశ్చిమ త్రిపుర జిల్లాలోని అమ్‌తులి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై సుష్మిత దేవ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘త్రిపురలో పార్టీ ప్రచారం కోసం  ఉపయోగించిన  వాహనాలపై దాడి చేసి  ధ్వంసం చేశారు. సుష్మిత దేవ్‌తో పాటుగా టీఎంసీ కోసం పనిచేస్తున్న కొందరు ఐ ప్యాక్ ఉద్యోగుల మీద కూడా దాడి జరిగింది. వారిపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు ఫోన్లు  కూడా లాక్కున్నారు.  త్రిపుర  సీఎం బిప్లబ్  దేబ్.. హర్యానాలో బీజేపీ  అడుగుపెట్టడాన్ని భరించలేకపోతున్నారని.. ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇలాంటి దాడులు ఎప్పుడు ఆపుతారు..?’అని తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన  ఓ వీడియోను  తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

త్రిపురలో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని  రకాలుగా  సిద్దమవుతోంది.  ‘త్రిపురార్ జొన్నో తృణమూల్’ పేరుతో ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలోనే త్రిపురలో పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీ సుస్మితా దేవ్‌ను నియమించింది. త్రిపురలో జరగబోయే సివిక్  బాడీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని సుష్మితా  దేవ్ గురువారం ప్రకటించారు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

‘మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ త్రిపురలో రాబోయే అన్ని ఎన్నికలలో టీఎంసీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అందులో భాగంగానే సివిక్ బాడీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాము. ఎన్నికలను ప్రకటించాక..  మా పార్టీ తుది వ్యూహాన్ని రూపొందిస్తుంది’ అని గురువారం అగర్తలాలో మీడియాతో  మాట్లాడుతూ చెప్పారు.

click me!