
Woman Naked Paraded In Pratapgarh: రాజస్థాన్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గర్భిణి పై దాడి చేసిన భర్త, అత్తమామలు.. బాధితురాలిని నగ్నంగా ఊరేగించారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మణిపూర్ వీడియో ఘటనను గుర్తుచేస్తోంది.
వివరాల్లోకెళ్తే.. ధరియావాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడా గ్రామంలో గర్భిణిని నగ్నంగా ఊరేగించారు. బాధితురాలికి ఏడాది క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. అయితే, ఆమె పొరుగున ఉన్న వ్యక్తితో పారిపోయిందని ఆరోపిస్తూ, ఆమె భర్త ఆమెను కొట్టి, ఆమెను గ్రామంలో సుమారు ఒక కిలోమీటరు పాటు నగ్నంగా ఊరేగించారు. ఆమెపై అత్తింటివారు అందరూ దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
చర్యలు తీసుకుంటామని సీఎం గెహ్లాట్ హామీ
ఈ ఘటనపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. అదే సమయంలో, ఈ మొత్తం వ్యవహారంపై రాజస్థాన్ ప్రభుత్వంపై బీజేపీ పలు ప్రశ్నలు సంధించింది. సంఘటనా స్థలానికి ఏడీజీ క్రైమ్‌ను పంపి ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను ఆదేశించారు. ఇలాంటి నేరస్థులకు నాగరిక సమాజంలో స్థానం లేదన్నారు. ఈ విషయంపై డీజీపీ ఉమేష్ మిశ్రా మాట్లాడుతూ.. 'ఈ ఘటన చాలా దారుణం. సాయంత్రం స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి సమాచారం తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ ఘటనలో పాల్గొన్న అత్తమామలు అందరినీ గుర్తించారనీ, వారిని పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.