
Maratha reservation protests: మధ్య మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్ల కోసం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు కర్ణాటక ప్యాసింజర్ బస్సుకు నిప్పుపెట్టారు, దీని ఫలితంగా కనీసం 12 మంది పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజారవాణా వాహనాలతో సహా పలు బస్సులకు నిప్పుపెట్టారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో రిజర్వేషన్ల కోసం మరాఠా కమ్యూనిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దగ్ధమైన ఆరు బస్సుల్లో 45 మంది ప్రయాణికులతో కూడిన కర్ణాటక ప్రభుత్వ బస్సు కూడా ఒకటి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి కర్ణాటకలోని హుబ్బళ్లి వెళ్తున్న కర్ణాటక బస్సును ఆందోళనకారులు అడ్డుకోవడంతో ప్రయాణికులు, సిబ్బందిని బలవంతంగా కిందకు దింపి బస్సుకు నిప్పుపెట్టి రాళ్లు రువ్వారు. "లాతూర్ వెళ్తున్న మహారాష్ట్ర బస్సును మా బస్సు ఫాలో అవుతుండగా రెండు వాహనాలు ఆగిపోయాయి. ప్రయాణికులను దింపి, ఆపై బస్సులను తగలబెట్టారు. మా బస్సును ఆపిన సుమారు 200-300 మంది వ్యక్తులు తమ డిమాండ్లను పాటించకపోతే మమ్మల్ని, బస్సును తగులబెడతామని బెదిరించారు. దీంతో మా ప్రాణాలను కాపాడుకునేందుకు వారి సూచనలను పాటించాల్సి వచ్చింది" అని బెళగావిలోని రామ్ దుర్గా ప్రాంతానికి చెందిన బస్సు డ్రైవర్ ఒకరు తెలిపారు.
మరాఠా సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జల్నా జిల్లాలోని అంతర్వాలీ సారథి తాలూకాకు చెందిన మనోజ్ జరంగే ఆగస్టు 29న నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. బిద్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున ఉన్న 150 గ్రామాలతో సహా సుమారు 130 గ్రామాల ప్రజలు జరంగే నిరసనకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. జరంగే ఆరోగ్యం క్షీణించడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శుక్రవారం వచ్చి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. పోలీసులు జరంగేను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో సమస్య మరింత ముదిరిందనీ, ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పలువురు పౌరులు, పోలీసులకు గాయాలయ్యాయని ఓ అధికారి తెలిపారు. దగ్ధమైన బస్సులోని ప్రయాణికులను మహారాష్ట్ర ప్రభుత్వ ఇతర బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించామనీ, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర బస్సులకు తరలించామని బెళగావిలోని నార్త్ వెస్ట్ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో నడుస్తున్న అన్ని కర్ణాటక బస్సుల భద్రత గురించి ఆ శాఖ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఔరంగాబాద్, జల్నా జిల్లాలకు బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. బెళగావి, హుబ్బళ్లి, విజయపూర్, బాగల్ కోట్, చిక్కోడి డివిజన్లతో పాటు పలు డిపోలు మహారాష్ట్రకు రోజూ 300కు పైగా బస్సులను నడుపుతున్నాయి. నిరసనల కారణంగా పొరుగున ఉన్న కొల్హాపూర్, సోల్హాపూర్, సాంగ్లీ, ఇచల్కరంజిలకు ట్రిప్పుల సంఖ్యను తగ్గించినట్లు సంబంధిత అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అల్లరిమూకలు చాలా దూకుడుగా ఉన్నాయనీ, వారిని చెదరగొట్టకపోతే పోలీసుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పరిస్థితి అదుపు తప్పితేనే స్వల్ప బలప్రయోగం చేయాలనీ, తీవ్ర నష్టం జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. పోలీసుల చర్యలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదనీ, అయితే ఈ ఘటనలో ఇద్దరు అధికారులు సహా 12 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. అయితే, నిరసనల్లో పాలుపంచుకున్న వారిలో రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.