
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం ఇరువర్గాల మధ్య దారుణానికి దారితీసింది. పొలంలో పని చేసుకుంటున్న ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులు నిప్పంటించారు. ఆ ఘటనను మొత్తం వీడియో తీసి పైశాచిక ఆనందం పొందారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాకు చెందిన బాధితురాలి పేరు రాంప్యారీ సహరియా. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కుటుంబానికి కొంత భూమి గవర్నమెంట్ నుంచి కేటాయించబడింది. అయితే ఈ భూమిని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. దీని మీద ఫిర్యాదు చేయగా…ఇటీవలే రెవెన్యూ విభాగం.. పొలాన్ని వారి నుంచి విడిపించి సహారియా కుటుంబానికి ఇప్పించింది. ఈ క్రమంలోనే బాధితురాలి మీద దాడి జరగడం గమనార్హం. ఆమె భర్త అర్జున్ పొలం వద్దకు వెళ్తుండగా.. ముగ్గురు నిందితులు ట్రాక్టర్ మీద వెళ్లిపోవడాన్ని గమనించాడు. ఎందుకో అనుమానం వచ్చి తన పొలం వైపు చూడగా.. అక్కడి నుంచి పొగలు రావడం కనిపించింది.
మంత్రగత్తె అనే నెపంతో మహిళను వివస్త్రను చేసి, ఊరేగించి.. సోషల్ మీడియాలో వైరల్..
ఏమై ఉంటుంది అని దగ్గరకు వెళ్లిచూడగా షాక్ అయ్యాడు. అతని భార్య మంటల్లో కాలి పోతుంది. తీవ్ర గాయాలపాలై ఉండడాన్ని గమనించాడు భర్త. ఆమె మంటలధాటికి కేకలు పెడుతూనే జరిగిన విషయాన్ని భర్తకు తెలిపింది. వెంటనే అతడు మంటలను ఆర్పి భార్యను హుటాహుటిన స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యకు నిప్పు అంటించి, ఆ ఘటనను వీడియోలు తీశారని.. ఈ విషయం తన భార్య చెప్పినట్లు అర్జున్ పోలీసులకు తెలిపాడు.
అర్జున్ ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను నిలబెట్టిన పార్టీ ఒక గిరిజన మహిళ మీద ఈ స్థాయి దారుణానికి అనుమతించింది. ఇది సిగ్గుచేటు చర్య’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.