ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీని అన్నయ్య గా సంబోధించారు.
ఢిల్లీ బడ్జెట్ 2023: ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, ఈ సమాచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వానికి అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. బడ్జెట్ విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టించడంతోపాటు ఆప్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి వారి దృష్టిని మళ్లించాలనే ఏకైక లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది.
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ ప్రకటన ప్రకారం.. "కేంద్రం రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేసిందని ఆప్ చెబుతుంది. ఇది పచ్చి అబద్ధం. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం, రాష్ట్రం కాదు, అందుకే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటాయి. అలాగే బడ్జెట్ కూడా ఆగలేదు. అని తెలిపింది.
ఘర్షణ ఎవరికీ సహాయం చేయదు: కేజ్రీవాల్
ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు మద్దతు ఇస్తే కేంద్రంతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు లేకుంటే ఢిల్లీ 10 రెట్లు అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కలిసి పని చేయాలనుకుంటోంది, ఘర్షణ కాదు.. ఘర్షణ ఎవరికీ సహాయం చేయదని, ప్రధానితో కలిసి పనిచేయాలని, ఎలాంటి గొడవలు అక్కర్లేదని అన్నారు. ప్రధాని ఢిల్లీని గెలవాలంటే ముందుగా నగర ప్రజల హృదయాలను గెలుచుకోవాలని కేజ్రీవాల్ అన్నారు. ఇదే తాను ఆయనకు చెప్పే మంత్రమని అన్నారు. మీరు అన్నయ్య, నేనే తమ్ముడిని.. మీరు సపోర్ట్ చేస్తే .. నేనూ సపోర్ట్‌గా ఉంటాను.. తమ్ముడి మనసు గెలుచుకోవాలంటే.. ముందు అతన్ని ప్రేమించండని అన్నాడు. ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్రం ఆమోదానికి పంపించడం రాజ్యాంగ మూలసూత్రాలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీఎం అన్నారు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ బడ్జెట్‌ను ఆపడానికి కేంద్రం కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. బడ్జెట్‌ను ఆపవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాజ్యాంగం ప్రకారం.. ఢిల్లీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి, ఆమోదం అవసరమని, గత 28 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం పొందే ముందు బడ్జెట్‌ను సమర్పించే తేదీని నిర్ణయించడం దానిలోనే తప్పు, ఆప్ ప్రభుత్వంపై దుర్మార్గాన్ని చూపిస్తుందని ఆరోపించింది.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోతే ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని మీడియా వేదిక ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023తో ముగుస్తుందని, బడ్జెట్ ఆమోదించినా, ఆమోదించకపోయినా ప్రతి ఉద్యోగికి జీతం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ ఫైలు ఆమోదం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మళ్లీ పంపామని ప్రస్తుత ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాష్ గెహ్లాట్ అంతకుముందు చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిందని, ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పామని వర్గాలు తెలిపాయి. బడ్జెట్ ఫైల్ నేరుగా , ఇమెయిల్ ద్వారా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆమోదం కోసం పంపినట్లు గెహ్లాట్ చెప్పారు.
విశేషమేమిటంటే..2023-24 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్‌ను మంగళవారం సమర్పించాల్సి ఉంది. అది నిలిపివేయబడింది. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం ఒక దానిపై ఒకటి వివిధ అంశాలలో కేటాయింపులపై ఆరోపణలు చేసుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రంపై ఆరోపణలు చేసిన తర్వాత, బడ్జెట్ ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బదులుగా ప్రకటనల కోసం అధికంగా నిధులు కేటాయించినందున మంత్రిత్వ శాఖ ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి వివరణ కోరినట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.