కొత్తరకం కరోనా.. యూకే ప్రభుత్వం ఆంక్షలు..!

By telugu news teamFirst Published Jan 9, 2021, 8:57 AM IST
Highlights

వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ముందు జాగ్రత్తల్లో ఇది కూడా ఒకటి. 

గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. దాని నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్నామనుకునే సమయానికి కొత్త రకం కరోనా అడుగుపెట్టింది. దీని ప్రభావం ఎక్కువగా  యూకేలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో యూకే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది.

భారత్ సహా ప్రపంచంలోని ఏ దేశం నుంచి వచ్చే వారికైనా కోవిడ్ 19 నెగిటివ్ ధ్రువీకరణ తప్పనిసరి అని యూకే ప్రభుత్వం తెలిపింది. యూకేలోకి రావడానికి 72 గంటల ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలని స్పష్టం చేసింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను అరికట్టేందుకు యూకే ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన ముందు జాగ్రత్తల్లో ఇది కూడా ఒకటి. 

కొత్త నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే తక్షణమే 500 పౌండ్ల జరిమానా విధిస్తామని ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇతర దేశాల నుంచి పడవ, రైలు, విమానాల ద్వారా వచ్చే ప్రయాణీకులెవరైనా 72 గంటల ముందు కోవిడ్‌ పరీక్ష చేయించుకోలేదని తేలితే దేశంలోకి అడుగుపెట్టనీయబోమని కూడా హెచ్చరించింది. హై రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వారికి 10 రోజుల సెల్ఫ్‌ ఐసోలేషన్‌ తప్పనిసరి అని యూకే రవాణా శాఖ పేర్కొంది.

వీరు లొకేటర్‌ ఫారం కూడా పూర్తి చేయాలని తెలిపింది. బుధవారం నుంచి అమలవుతున్న లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో మరీ అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. అలాగే, యూకే నుంచి భారత్‌ సహా ఇతర దేశాలకు వెళ్లే వారు కూడా 72 గంటలు ముందు కోవిడ్‌ నెగెటివ్‌ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. 

ఇవే ఆంక్షలను అమలు చేయనున్నట్లు స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్‌ ఐర్లాండ్‌ కూడా ప్రకటించాయి. శుక్రవారం యూకేలో 68,053 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒకే రోజులో అత్యధికంగా 1,325 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,57,472కు చేరుకుంది. మరణాల సంఖ్య 79,833 కు చేరుకుంది. గురువారం నాటికి దేశంలో 15 లక్షల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.
 

click me!